
నీళ్ల చారుతో భోజనమా?
కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్‌లో సిబ్బందికి మంచి భోజనం వండి విద్యార్థులకు మాత్రం నీళ్ల చారు పెడతారా..? రెండు నెలలుగా కోడి గుడ్డు లేదు.. మీ ఇంట్లో పిల్లలకు ఇలాంటి భోజనమే ఇస్తారా అంటూ హాస్టల్ వార్డెన్‌తో పాటు సిబ్బందిపై ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుకొని సోమవారం కౌడిపల్లి ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ గదులు, పరిసరాలు, టాయిలెట్స్‌ను పరిశీలించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. హాస్టల్‌లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. హాస్టల్ సిబ్బంది మంచి భోజనం వండుకొని పిల్లలకు నీళ్ల చారు పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చింతపండు తప్ప ఏ స్టాక్ లేదన్నారు. హాస్టల్ నుంచే కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలను వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ ఆంజనేయులు, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గణేశ్వర్, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఆర్‌ఐ శ్రీహరి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు నవీన్‌గుప్త, నాయకులు పాల్గొన్నారు.
మెరుగైన చికిత్స కోసం మెదక్ తరలింపు
ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో 11 మందిని సోమవారం సాయంత్రం మెదక్ ఎంసీహెచ్ తరలించారు. ఉదయం మండల వైద్యాధికారి శ్రీకాంత్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో హాస్టల్‌లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 31 మందికి చికిత్స అందించారు. మరో నలుగురికి మందులు పంపిణీ చేశారు. కాగా ఇందులో వివిధ తరగతులకు చెందిన 11 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం 108లో మెదక్ ఎంసీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని, ముందు జాగ్రత్తగా జిల్లా అధికారులు సూచన మేరకు మెదక్ తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
మీ పిల్లలకు ఇలాగే పెడతారా..
హాస్టల్ వార్డెన్‌పై
ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్
చికిత్స పొందుతున్న
విద్యార్థులకు పరామర్శ
సిబ్బందికి మాత్రం
నాణ్యమైన ఫుడ్‌పై ఆరా..

నీళ్ల చారుతో భోజనమా?