
ధాన్యం కొనుగోలుకు సహకరించండి
రైస్‌మిల్లర్లకు ఆర్డీఓ జయచంద్రారెడ్డి విజ్ఞప్తి
వెల్దుర్తి(తూప్రాన్): రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కోరారు. సోమవారం వెల్దుర్తి పీఏసీఎస్ కార్యాలయంలో రబీ ధాన్యం కొనుగోలుపై మిల్లర్లు, మండల పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఖరీఫ్‌లో లాగే రబీలో సైతం సహకారం అందించాలని, ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ధాన్యాన్ని దించుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఽరైస్‌మిల్లుల వరకు ధాన్యం తరలించడానికి లారీలపైనే ఆధార పడకుండా ట్రాక్టర్లలో వచ్చిన ధాన్యాన్ని సైతం ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్‌లకు అవసరం మేరకు హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.