
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వారిని ఆదుకునే పథకాలను తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్రంలో కులగణన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని కొనియాడారు. వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకతీతంగా గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఒకవైపు వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ మరోవైపు నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాయితీ రుణాలను ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వ్లెడించారు. త్వరలో మరో 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.