70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. రెండవసారి(గతేడాది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా నిలిచింది)నేషనల్ అవార్డు రావడం తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అవార్డు ప్రకటన వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా రెండు సార్లు నేషనల్ అవార్డులు రావడం గర్వగా ఉందన్నారు. కార్తీకేయ 2లో నటించిన నటీనటులతో పాటు పాటు టెక్నీషియన్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అందరి కష్టానికి ప్రతిఫలమే ఈ అవార్డు’అని అన్నారు.
(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)
సంతోషంగా ఉంది: నిఖిల్
కార్తికేయ 2కి నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు హీరో నిఖిల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ‘మన ‘కార్తికేయ 2’ జాతీయ అవార్డుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోవడానికి, జాతీయ పురస్కారానికి ఎంపికవ్వడానికి కారణం చిత్ర బృందం. నిర్మాతలు, దర్శకుడు చందూ, హీరోయిన్ అనుపమ, డీవోపీ కార్తిక్ ఘట్టమనేని.. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని నిఖిల్ అన్నారు.
తమ చిత్రానికి జాతీయ పురస్కారం రావడం పట్ల కార్తికేయ2 చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో కార్తికేయ మంచి వసూళ్లు సాధించడమే కాకుండా అవార్డులు కూడా రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. హైదరాబాద్ లోని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయం వద్ద దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ , టీజీ విశ్వప్రసాద్ లు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్తికేయ2 తాము ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చిందని... జాతీయ పురస్కారానికి తమ చిత్రాన్ని ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోదీ, నేషనల్ అవార్డు జ్యూరీ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయ3పై ప్రాథమిక ప్రకటన చేసిన దర్శకుడు చందు... స్క్రిప్ట్ వరకు తుది దశకు చేరిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment