ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ కూడా ఒకానొక సమయంలో మానసిక వేదన అనుభవించిన వ్యక్తే. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. మానసిక సమస్యలతో తానో యుద్ధమే చేశానంటూ దానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడిచింది.
"టీనేజర్‌గా ఉన్నప్పుడు అంటే 13-14 ఏళ్ల వయసులో తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనయ్యాను. ఇదేం నా జీవితాన్ని నాశనం చేసేంత ఇబ్బంది పెట్టలేదు. ఒక్కసారి బలంగా అనుకుంటే దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు, అది మన చేతుల్లోనే ఉందని నమ్మాను. కానీ డిప్రెషన్‌కు గురైనప్పుడు మాత్రం ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటపడలేకపోయాను. అప్పుడు చాలా భయమేసింది. నవంబర్ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
నేను కుంగుబాటుకు లోనయ్యాను. తెలియకుండానే కన్నీళ్లు జలజలా రాలేవి. నా బతుకుకు అర్థం లేదు అనుకునేంతవరకు వెళ్లాను. అసలు ఎందుకు బతకాలి? దేనికోసం బతకాలి? అని పిచ్చిపిచ్చిగా ఆలోచించాను. ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు నన్ను ఆసుపత్రి బెడ్ మీదకు చేర్చాయి. నా పరిస్థితి చూసి పేరెంట్స్ కంగారుపడ్డారు. వెంటనే వాళ్లు ఇండియా నుంచి అమెరికాకు వచ్చారు. నా ఆరోగ్యం కుదుటపడి మళ్లీ మామూలు మనిషి అయ్యేవరకు నా వెంటే ఉన్నారు.
అంతా ఓకే అనుకుంటున్న సమయంలో మార్చిలో నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది సడన్‌గా నేను బెడ్ మీద నుంచి కూడా లేవలేకపోయాను, స్నానం చేయకుండా, పిడికెడు మెతుకులైనా తీసుకోకుండా అచేతనంగా ఉండిపోయాను. ఒళ్లంతా చెమటలు, మరోవైపు గుండె వేగం పెరిగింది. ఆ క్షణం నేను చచ్చిపోతున్నా అనుకున్నా.. హాస్పిటల్‌కు తీసుకెళ్తే ఇది యాంగ్జైటీ అటాక్ అని చెప్పారు. ఏ కారణం లేకపోయినా తీవ్రంగా ఆందోళన చెందేదాన్ని. ఇలా ఆందోళన చెందిన ప్రతిసారి నాకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాన్ని, ఛాతీలో నొప్పి నన్ను కుదిపేసేది. అప్పుడే మంచి సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అతడి దగ్గరకు వెళ్లాక నా పరిస్థితి కొంత మెరుగైంది" అని ఆలియా కశ్యప్ చెప్పుకొచ్చింది.
చదవండి: ప్రాణవాయువు పంపిస్తాన్న హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్
Comments
Please login to add a commentAdd a comment