జయప్రకాశ్‌రెడ్డి
జయప్రకాశ్‌రెడ్డిగారు మొదట వెంకటేశ్ బాబు సినిమా ‘బ్రహ్మపుత్రుడు’, ‘బొబ్బిలిరాజా’ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. తర్వాత ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలో ఆ పాత్ర (హీరోయిన్ తండ్రి పాత్ర)ని ఎవరు చేస్తే బావుంటుంది? అనుకున్నప్పుడు నా మైండ్‌లోకి జేపీగారు వచ్చారు. ఆ సినిమాలో ఆయన పాత్రకి మంచి పేరు రావడం, ఆ తర్వాత ఆయన కెరీర్ మారిపోవటం తెలిందే. ఆయన వ్యక్తిగతంగా చాలా పద్ధతి కలిగిన మనిషి. ఎంతో హుందాగా వ్యవహరించేవారు. వ్యక్తిగతంగా దైవభక్తి చాలా ఎక్కువ. హైదరాబాద్‌లో తక్కువ ఉండేవారు. షూటింగ్‌కు కూడా వచ్చినప్పుడు మా గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు.
తనకి మొదటి నుండి నాన్నగారన్నా (రామానాయుడు), నేనన్నా చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఆయనకు తొలి అవకాశం మా ద్వారా వచ్చిందని మాతో ఎంతో గౌరవంతో ఉండేవారు. నేను కూడా ఆయనతో చాలా అభిమానంగా ఉండేవాణ్ణి. జేపీగారు సినిమాల్లోకి రాకముందు రాయలసీమ భాష ఒకలా ఉంటే ఆయన వచ్చాక ఆ భాషను పూర్తిగా మార్చేశారు. ‘ప్రేమించుకుందాం రా’లో చేసిన పాత్ర కోసం ఆయన ఓ టేప్ రికార్డర్ తీసుకుని రాయలసీమలోని అనేక ప్రాంతాలు తిరిగి ఆ యాసను పట్టుకున్నారు. చాలా కృషి చేశారు. ఆయన ఏకపాత్రాభినయం చేసిన ‘అలెగ్జాండర్’ నాటకం గొప్పగా ఉంటుంది. ఆ నాటకాన్ని 400 సార్లు ప్రదర్శించిన గొప్ప నటుడు. – నిర్మాత సురేశ్‌బాబు
జేపీగారిని మాత్రమే అంకుల్ అని పిలుస్తా
నా మొదటి సినిమా ‘నీకోసం’ నుంచి ఇటీవల తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వరకు నా సినిమాల్లో జయప్రకాశ్‌రెడ్డి అంకుల్ ఉండేవారు. ఎప్పుడైనా డేట్లు ఖాళీ లేక ఒకటీ రెండు సినిమాలు చేయలేదు. నేను కొంచెం రిజర్వ్‌డ్‌గా లో ప్రొఫైల్‌లో ఉంటానని అందరికీ తెలుసు. జేపీగారికి వ్యక్తిగతంగా నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎంతో ఆప్యాయంగా ‘నాన్నా’ అని పిలిచేవారు. సినిమా పరిశ్రమలో ఆయన్ని మాత్రమే నేను అంకుల్ అని పిలిచేవాణ్ణి. మొదట్నుంచీ తెలియకుండానే మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉండేది.
నెల క్రితం ఆయన నాకు ఫోన్ చేసి, ‘ఏంటి నాన్నా.. ఎలా ఉన్నావు’ అని అడిగారు. ఇద్దరం త్వరలోనే కలుద్దాం అనుకున్నాం. రెండు రోజుల క్రితం మా డైలాగ్ రైటర్ గోపీ మోహన్‌తో ‘మన సినిమాలో అంకుల్‌కి కీలకమైన పాత్ర ఉండేలా బాగా డిజైన్ చేయ్యాలి’ అని చెప్పాను. ఆయన చూడటానికి అలా గంభీరంగా ఉంటారు కానీ చాలా క్రమశిక్షణగా ఉంటారు. తక్కువగా తింటారు. అనుకోకుండా ఆయన మనల్ని వదిలి వెళ్లడంతో షాక్‌లో ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
– దర్శకుడు శ్రీను వైట్ల
జేపీ కోసమే ఆ సినిమా చూశారు
నేను దర్శకత్వం వహించిన ‘లారీ డ్రైవర్’ సినిమాలో జయప్రకాశ్ రెడ్డిగారు చిన్నవేషం వేశారు. ఆ తర్వాత ‘బొబ్బిలిరాజా’ చిత్రంలో కోయ దొర వేషం వేశారు. సీరియస్ పాత్రను ఎంత బాగా చేసేవారో, కామెడీని కూడా అంతే బాగా పండించేవారు. ఆయన్ని జేపీ అని పిలిచేవాణ్ణి. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమాల్లో బాలకృష్ణగారితో పాటు ఎంతో అద్భుతంగా నటించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన.
ఆయన సొంతంగా తన రాయలసీమ యాసను పరిశోధన చేసి డెవలప్ చేసుకున్నారు. మంచి స్టేజ్ ఆర్టిస్ట్.. చాలా గొప్ప వ్యక్తి. ‘సమరసింహా రెడ్డి’ సినిమా విడుదల తర్వాత నన్ను, ఆయన్ను రాయలసీమకి ఆహ్వానించారు అక్కడి ప్రజలు. రాయలసీమకి వెళితే వారందరూ ఆయన్ని కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఎప్పడూ సినిమా చూడని చాలామంది ఈయన కోసం ఆ సినిమా చూశామని చెప్పటం నాకింకా గుర్తు. తెలుగు సినిమా పరిశ్రమకి జేపీ మరణం తీరని లోటు. – దర్శకుడు బి. గోపాల్
విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి పలువురు సినిమారంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
జయప్రకాశ్ రెడ్డిగారి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేశారాయన. నటుడిగా ఆయన బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి ఆయన. – మంచు మోహన్ బాబు
జయప్రకాశ్ రెడ్డిగారి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో ఆయనతో కలిసి చివరిసారిగా నటించా. ‘నాటక రంగం నా కన్నతల్లి. సినిమా రంగం నా పెంచిన తల్లి. అందుకే శని, ఆదివారాల్లో షూటింగ్ పెట్టుకోను.. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంటా.. మీరు ఎప్పుడైనా నాటకం చూసేందుకు రావాలి’ అని అడిగేవారు. కానీ నేను ఆయన నాటకం చూసే అవకాశాన్ని పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే మొదట గుర్తొచ్చేది ఆయనే. తనకంటూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారాయన. – చిరంజీవి
ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డిగారి మృతి విచారకరం. పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. – బాలకృష్ణ
నా ప్రియమైన మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి మరణం విని ఎంతో బాధ కలిగింది. తెరమీద మా ఇద్దరిదీ గ్రేట్ కాంబినేషన్. ఖచ్చితంగా నిన్ను మేము మిస్ అవుతున్నాం. నిన్ను అభిమానించేవారికి, మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. – వెంకటేశ్
జయప్రకాశ్ రెడ్డిగారు ఎంతో మంచి మనిషి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నా. – నాగార్జున
రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని చూపించారు జయప్రకాశ్ రెడ్డిగారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా, హాస్యనటుడిగా అలరించారాయన. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పోలీస్ కమిషనర్ పాత్ర చేశారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయేవారు. సినిమా, నాటక రంగాలకు ఆయన లేని లోటు తీరనిది. – పవన్ కల్యాణ్
జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం ఎంతో బాధ కలిగించింది. తెలుగు సినిమా పరిశ్రమలోని మంచి హాస్య నటుల్లో ఆయనొకరు. ఆయనతో పనిచేసిన రోజుల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. – మహేశ్‌బాబు
అద్భుతమైన నటనతో అందర్నీ అలరించిన జయప్రకాశ్ రెడ్డిగారు ఇక లేరనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. – ఎన్టీఆర్
జయప్రకాష్ రెడ్డిగారు ఇక లేరు అనడం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. – అల్లు అర్జున్
టాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. రంగస్థలం మీద, వెండితెరపైన తనదైన ప్రత్యేకశైలి నటన, వాచకం, విభిన్నమైన పాత్రలతో ఎందరో అభిమానులను జయప్రకాశ్ రెడ్డిగారు సంపాదించుకున్నారు. మా సొంత నిర్మాణ సంస్థల్లో కూడా 3 చిత్రాల్లో నటించి, మెప్పించారు. ఆయనతో చివరిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కలసి నటించాను. ఆయన విలక్షణ నటన చిరకాలం గుర్తుండిపోతుంది. – విజయశాంతి
జయప్రకాశ్ రెడ్డిగారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ఇకలేరనే విషయం తెలియగానే షాక్‌కి గురయ్యా. ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలోనూ ఆయన ఉన్నారు. అలాంటి మంచి నటుణ్ణి, మంచి వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. – వీవీ వినాయక్
జయప్రకాష్ రెడ్డిగారి హఠాన్మరణం గురించి తెలియగానే ముందు షాక్ అయ్యాను.. ఆ తర్వాత బాధపడ్డాను. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కొన్ని దశాబ్దాలుగా మీ శైలిలో మధురమైన హాస్య పాత్రలు, విలన్ పాత్రలు పోషించి మాకు వినోదం పంచినందుకు కృతజ్ఞతలు సార్. – రాజమౌళి
జయప్రకాష్ రెడ్డిగారికి నేను గొప్ప అభిమానిని. ఆయన లేరనే విషయం తెలిసి షాక్ అయ్యా.. నా గుండె పగిలింది. స్టూడియోలో మేమంతా ఆయన శైలిలో డైలాగులు చెబుతూ పగలబడి నవ్వుతుంటాం. ఈ విషయాన్ని ఆయనకి ఎన్నో సార్లు చెప్పాను కూడా. ఆయన ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ వినయంగా ఉండేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆయన నటనని చాలా ఎంజాయ్ చేశాను. మిస్ యు సార్. – దేవిశ్రీ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment