
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) విన్నర్ గెల్చుకునే ప్రైజ్‌మనీ రూ.50 లక్షలు. తెలుగులోనే కాదు హిందీలోనూ ఈ ప్రైజ్‌మనీ దాదాపు అంతే ఉంటుంది. అయితే వినడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ అది వెంటనే చేతికి ఇస్తే ఇంకా బాగుండేదంటున్నాడు హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ విజేత కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra). సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గత నెలలోనే పూర్తయింది. ఈ షోలో కరణ్ టైటిల్ గెలవగా వివియన్ డిసేన రన్నరప్‌గా నిలిచారు. కరణ్.. రూ.50 లక్షలు గెలిచాడన్నమాటేకానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదట!
చేతికందని ప్రైజ్‌మనీ
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కలర్స్ ఛానల్‌లో నేను పాల్గొన్న మొదటి షో ఖత్రోన్ కె ఖిలాడీ-సీజన్ 14. గతేడాది జరిగిన ఈ షోలో విజయం సాధించాను. తద్వారా రావాల్సిన డబ్బు ఇటీవలే ముట్టింది. ఇదే ఛానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని మరోసారి విజయం సాధించాను. కానీ ఇప్పటివరకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీని నాకివ్వనేలేదు. అలాగే కారు కూడా బహుమతిగా ఇస్తామన్నారు. దానికోసం ఎంతో ఎదురుచూడగా ఇప్పుడు నాచేతికి వచ్చేసింది.
అభిమానులతో జాలీగా..
అయితే ఈ షో నేను గెలుస్తాననుకోలేదు. అభిమానుల అండదండల వల్లే నా విజయం సాధ్యమైంది. ఒకవేళ నేను గెలవకపోయినా ఇంతే సాధారణంగా ఉండేవాడిని. బిగ్‌బాస్ తర్వాత నాకు విపరీతమైన ప్రేమాభిమానాలు దక్కుతున్నాయి. చాలా సమయం ఫ్యాన్స్‌తోనే గడుపుతున్నాను. నన్ను ఆశీర్వదించిన మహిళలకూ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కరణ్ బిగ్‌బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో తన సిబ్బంది పిల్లలకు చదువు చెప్పిస్తానన్నాడు.