‘‘నేను సినిమాల్లోకి వచ్చి 36 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొంచెం నెర్వస్‌గా ఫీలవుతుంటాను. ప్రతి సినిమాని సవాల్‌గా భావిస్తాను. ఒక సినిమాకి ఏడాదికి పైగా పని చేస్తాం కాబట్టి మంచి కథ ఎంచుకున్నానా? లేదా అని ఆలోచిస్తాను. షూటింగ్‌లో ప్రతి రోజూ చాలెంజ్‌గానే ఉంటుంది’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది.
ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు..
►‘గరుడవేగ’ సినిమా చూసి, ప్రవీణ్ సత్తారుని పిలిచి, ఓ మంచి సినిమా చేద్దామన్నాను. యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దామని తను చెప్పాడు. అందరూ అదే జానర్‌లో చేస్తున్నారు.. మనం స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దాం అన్నాను. మూడు నాలుగు నెలలు సమయం తీసుకుని ‘ది ఘోస్ట్’ కథ రాసుకొచ్చాడు ప్రవీణ్. కథ వినగానే అద్భుతంగా అనిపించడంతో ఓకే చెప్పాను.
►‘ది ఘోస్ట్’ పెద్ద కథ, అద్భుతాలు సష్టిస్తుందని చెప్పను.. కానీ చాలా మంచి కుటుంబ కథ. ‘శివ’ సినిమాలో ఫ్యామిలీ డ్రామా బాగా వర్కవుట్ అయింది. ‘ది ఘోస్ట్’లోనూ అలాగే ఉంటుంది. ఆపదలో ఉన్న సోదరిని కాపాడే పాత్ర చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇది యాక్షన్ ఫిల్మ్ అయినా ఎమోషన్ బాగా సెట్ అయింది. ఈ కథని ప్రవీణ్ చాలా కొత్తగా తీశాడు. ఫైనల్ కాపీ చూశాక నేనే షాక్ అయ్యాను. తన స్టోరీ ప్రజెంటేషన్ కి ఇంప్రెస్ అయ్యాను.
►‘ది ఘోస్ట్’ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం ఉంది.. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నాం. ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ చాలా ముఖ్యం. రిలీజ్‌కి ముందు మనం ఒక హైప్ క్రియేట్ చేయాలి. సినిమా రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ మన చేతుల్లో ఉండదు.. మూవీ బాగుంటే మౌత్ టాక్‌తో అందరికీ దగ్గరవుతుంది.
►పండగ సమయాల్లో రెండు పెద్ద సినిమాలు విడుదలఅయినా ప్రేక్షకులు చూస్తారు. చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, నా ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అవడం హ్యాపీ. మా ఇద్దరి సినిమాలు గతంలో రెండు మూడు రోజుల తేడాతో విడుదలయ్యాయి.. కానీ, ఇన్నేళ్లలో ఒకే రోజు విడుదల కావడం ఇదే మొదటిసారి. అయినా ఎలాంటి పోటీ లేదు.. రెండూ బాగా ఆడాలి.
►‘ది ఘోస్ట్’లో నేను, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా చేశాం. నాతో పాటు సోనాల్ యాక్షన్ సీక్వెన్స్ చేసింది.. ఇందుకోసం రెండు మూడు వారాలు శిక్షణ తీసుకుని అద్భుతంగా చేసింది. ‘శివ’ సినిమా రిలీజ్ తర్వాత సౌండ్ డిజైనింగ్ బాగుందని అందరూ అన్నారు. ‘ది ఘోస్ట్’ ప్రీమియర్ చూసినవారు సినిమా చాలా బాగుందని, ప్రత్యేకించి సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉందని చెప్పడంతో సినిమా విజయంపై మా నమ్మకం మరింత పెరిగింది.
►నా ‘శివ’ చిత్రాన్ని 4కేలోకి మార్చి రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం.. అందుకు సమయం పడుతుంది. ఇటీవల సినిమాకి బౌండరీలు లేకపోవడం శుభపరిణామం. ‘ఆర్‌ఆర్ ఆర్’ చిత్రాన్ని జపాన్ లో దాదాపు వెయ్యిమంది పట్టే ఓ థియేటర్‌లో నిల్చొని చూడటం గొప్ప విషయం. ‘ఆర్‌ఆర్‌ఆర్, బ్రహ్మాస్త్ర, కార్తికేయ 2’ చిత్రాల్లో గ్రాఫిక్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంది. అయితే గ్రాఫిక్స్ కూడా ప్రేక్షకులు ఒరిజినల్‌లా భావించేలా ఉండాలి.. అంతేకానీ గ్రాఫిక్స్ అనుకునేలా ఉండకూడదు.
►నాగచైతన్యతో కలిసి ‘మనం, బంగార్రాజు’ సినిమాలు చేశాను. అఖిల్‌తో ఓ సినిమా చేద్దామనుకున్నాను. తనకి యాక్షన్ అంటే ఇష్టం.. అందుకే యాక్షన్ డ్రామా నేపథ్యంలో మా కాంబినేషన్ ఉంటుంది. ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో అమల చేసిన తల్లి పాత్ర అద్భుతంగా ఉంది.. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ‘బ్రహ్మాస్త్రం’లో నా పాత్ర నిడివి తక్కువ అయినా మంచి పేరొచ్చింది. ‘బ్రహ్మాస్త్రం 2’లో నేను ఉంటానో? లేదో తెలియదు. వరుసగా సినిమాలు చేస్తున్నాను.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని తర్వాతి సినిమా మొదలు పెడతాను. రెండు మూడు కథలు చర్చల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment