
Bigg Boss 5 Telugu, Siri Hanmanth: టాలీవుడ్ దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిలకు అవకాశాలివ్వరు, పొరుగు రాష్ట్రాల నుంచే హీరోయిన్లను దిగుమతి చేసుకుంటారని ఇప్పటికీ విమర్శలు వినబడుతూనే ఉంటాయి. అయితే తెలుగు అమ్మాయిలను హీరోయిన్‌గా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట! తన సినిమా విషయంలో ఇదే జరిగిందంటున్నాడు నటుడు నంద కిషోర్. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో సందడి చేసిన ఈ నటుడు 'నరసింహపురం' సినిమా చేశాడు. ఈ ఏడాది జూలైలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన సిరి హన్మంత్‌పై ఆ మధ్య షాకింగ్ కామెంట్స్ చేశాడు నంద కిషోర్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
'తెలుగమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వడం అరుదనే చెప్పాలి. అలాంటి సమయంలో వైజాగ్ అమ్మాయి సిరి హన్మంత్‌కు కథానాయికగా ఛాన్స్ ఇచ్చారు. మిగతా సినిమాల్లాగా కాకుండా హీరోయిన్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. ఇంత మంచి పాత్రలు తెలుగువాళ్లకు రావు. ఆమెను ప్రమోషన్స్‌కు పిలిచినప్పుడు నేను రాలేను అని చెప్పింది. ట్రైలర్‌లో తన పాత్ర అసభ్యంగా ఉందని, అది చూసినవాళ్లకు తన మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని తనకు తానే ఊహించుకుంది. దానికి, ప్రమోషన్స్‌కు రాకపోవడానికి సంబంధం ఏంటో నాకర్థం కాలేదు. ఏదేమైనా హీరోయిన్‌గా సినిమా ప్రమోషన్స్‌కు రావడం తన బాధ్యత. తన పాత్ర గురించి ముందు ఒకలా చెప్పారు కానీ తర్వాత వేరేలా చూపించారని ఆమె ఫీలైంది. కానీ ఒకసారి సిరి సినిమా చూస్తే దర్శకుడు తనను ఎంత బాగా చూపించాడో అర్థం అయ్యేది. నాకు తెలిసి ఆమె ఇప్పటికీ సినిమా చూసి ఉండదు, చూస్తే మాత్రం తన అభిప్రాయం మారొచ్చు' అని నంద కిషోర్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment