ప్రముఖ బాలీవుడ్ నటుడు షానవాజ్ ప్రధాన్(56) గుండెపోటుతో మరణించారు. ముంబైలో శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో షానవాజ్ ఛాతీలో నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న లగాన్ నటుడు యశ్‌పాల్ శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ముంబైలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాను. వందలాది మంది ఆర్టిస్టులతో ప్రాంగణం కళకళలాడుతోంది. ఇంతలో అవార్డు అందుకున్న షానవాజ్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ప్రోగ్రాం నిలిపివేసి ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ బతికించుకోలేకపోయాం. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణాలు వదిలారు' అని భావోద్వేగానికి లోనయ్యాడు.
కాగా షానవాజ్.. 'అలిఫ్ లైలా', 'హరి మర్చి లాల్ మిర్చి', 'బంధన్ సాత్ జన్మోన్ కా' సహా పలు సీరియల్స్‌లో నటించారు. 'ప్యార్ కోయ్ ఖేల్ నహీ', 'ఫాంటమ్', 'రేస్' వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. 'బెటర్ లైఫ్ ఫౌండేషన్', 'మీర్జాపూర్', 'హోస్టేజెస్' వంటి వెబ్‌సిరీస్‌లో కూడా ఆయన పలు పాత్రలు పోషించారు. అంతే కాకుండా 'దూకుడు', 'బృందావనం', 'అతడు', 'జులాయి', 'రేసు గుర్రం', 'రచ్చ', 'ఛత్రపతి', 'మున్నా' సహా ఎన్నో తెలుగు సినిమాలకు, ఫారిన్ సినిమాలకు హిందీ డబ్బింగ్ చెప్పారు. ఎక్కువగా కోట శ్రీనివాసరావుకు ఆయన హిందీ వర్షన్‌లో డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment