
కోల్‌కతా : బెంగాల్ ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఛటర్జీ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా, ఛటర్జీ అక్టోబర్ 6న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత కరోనా నెగెటివ్ అని తేలడంతో తన నివాసానికి వెళ్లారు. మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 14న ఆస్పత్రికి తరలించారు. సౌమిత్ర ఛటర్జీని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
బెంగాలి తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్రి చటర్జీ .. సత్యజిత్‌రాయ్ సినిమా ‘అపుర్ సంసార్’తో తన కెరియర్ ప్రారంభించారు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ చిత్ర సీమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 2012లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.