
తమిళ సినిమా: నటుడు వికాస్ కథానాయకుడిగా నటిస్తున్న దుశ్శాసన్ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాయ్ తిరైయరంగం పతాకంపై ఎస్.అరుణ్ విఘ్నేశ్, ఆర్‌వేల్ మురుగన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. దళపతి దర్శకత్వం వహిస్తున్నారు. నటి రోహిణి నాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మనోహర్, మిల్టన్ మెడిసన్, ప్రభు శాస్త్రి, వేలాంగణి, సాయి రోహిణి, విఘ్నేష్ వీఎస్, శరవణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి బాల మురుగన్ చాయాగ్రహణం, విజయ్ ప్రభు సంగీతాన్ని అందిస్తున్నారు.
చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ.. ద్రౌపతికి వ్రస్తాపహరణం చేసిన వాడే దుశ్శాసనుడు కాదు. ఇతరుల అవమానాలను, బాధలను పట్టించుకోకుండా తన స్వార్థం కోసం ఇతరులను మానసికంగా హింసించేవాడు.. వారి హక్కులను, ప్రాణాలను బలికొనేవాడూ దుశ్శాసనుడే అని చెప్పే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దుకాణాల్లో దొంగతనం సంఘటనతో చిత్ర కథ మొదలయ్యి పోలీసుల దర్యాప్తు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం దుశ్శాసన్ అని చెప్పారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్ ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment