అభిమానుల మృతితో కన్నీళ్లు పెట్టుకున్న హీరో యశ్‌ | Actor Yash Visits Village And Console The Family Members Of The Deceased Fans - Sakshi
Sakshi News home page

ముగ్గురు ఫ్యాన్స్‌ మృతి.. ఆ కుటుంబాల బాధ్యత నాదంటూ కన్నీరు పెట్టుకున్న యశ్‌

Published Tue, Jan 9 2024 7:49 AM | Last Updated on Tue, Jan 9 2024 9:59 AM

Actor Yash Console Family Of The Deceased Youth - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ యశ్ బర్త్ డే సందర్భంగా జనవరి 8న ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. వారందరి కుటుంబాలను హీరో యశ్ సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆపై వారికి ఆయన భరోసా ఇచ్చారు.

షూటింగ్‌ కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్న యశ్‌ సంఘటన తెలియగానే ప్రత్యేక విమానంలో హుబ్లీకి వచ్చి ఆపై నేరుగా కారులో గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. తన పుట్టినరోజు నాడు  చనిపోయిన యువకుల కుటుంబాలను చూసి ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. యశ్‌ రాకతో అక్కడ రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి జనాన్ని అదుపు చేశారు. ఘటనా స్థలంలో ఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు సహా వంద మందికి పైగా పోలీసులు ఉన్నారు.

ఆ కుటాంబాలను ఓదార్చిన అనంతరం మీడియాతో యష్ స్పందిస్తూ.. 'ఇలా జరిగే అవకాశం ఉంటుందనే నా పుట్టినరోజును సింపుల్‌గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారంటే నాకు చాలా బాధగా ఉంది. చేతికి వచ్చిన బిడ్డలు ఇక తిరిగిరారని తెలిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు.  ఆ యువకుల కుటుంబానికి ఏది అవసరమో అది నేను చేస్తాను. ఆ తల్లిదండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగి రారు. కానీ ఆ కుటుంబాల కోసం ఎప్పటికీ నేను అండగా ఉంటాను.

వారి కుటుంబాలకు  ఏది అవసరమో ఇక నుంచి నేను చేస్తాను. ఆ యువకులను తిరిగి పొందలేము కానీ ఆ కుటుంబాలకు నేను ఖచ్చితంగా కుమారుడి స్థానంలో ఉండి నా బాధ్యతను నెరవేరుస్తాను. అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే మీ జీవితంలో సంతోషంగా ఉండండి, మా గురించి ఆలోచించకండి. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా.. మరోసారి ఇలాంటి పనులు చేయకండి.. ఇక నుంచైనా ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు వదిలేయండి. ఇంత ప్రమాదకరమైన ప్రేమను తెలపడం  అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా బైక్‌లపై కొందరు యువకులు వెంబడిస్తున్నారు. ఇలాంటి మెచ్చుకోలు నాకు అక్కర్లేదు. అని యశ్‌ అన్నాడు.

ఆ కుటుంబాలను చూసిన యశ్‌ కంటతడి పెట్టాడు.. కానీ వారందరికీ అండగా ఉంటానని ఆయన మాట ఇచ్చాడు. తన పుట్టినరోజు నాడు ఎలాంటి కటౌట్లు కట్టొద్దని ఆయన గతంలోనే ఫ్యాన్స్‌కు చెప్పాడు. అలాంటి పనులు జరిగే అవకాశం ఉంటుందని గతేడాది తన పుట్టినరోజు నాడే తెలిపాడు యశ్‌. 'రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయనే నివేదికల కారణంగా ఈసారి నా పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నేను షూటింగ్‌ పనిమీద గోవాలో ఉన్నాను. ఈ వార్త వినగానే నేను చాలా బాధపడ్డాను. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఏడాది కూడా ఈ ప్రమాదం జరిగింది. నా బర్త్ డే అంటేనే భయమేస్తోంది.' అని  యశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం సురంగి గ్రామం నుంచి జిమ్స్‌ ఆసుపత్రికి యశ్‌ వెళ్లారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య వివారులు అడిగి ఆయన తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు కూడా ఆయన తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం వారి వైద్య ఖర్చులు పూర్తిగా యశ్‌ చెల్లించినట్లు సమాచారం. వారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనను వ్యక్తిగతంగా కలవాలని యశ్‌ సూచించారట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement