సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటుడుగా 50 వసంతాలకు దగ్గరలో ఉన్న నటుడు ఈయన. 1975లో అపూర్వ రాగంగళ్ చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన రజనీకాంత్ ఇప్పటివరకు 168 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం 169వ చిత్రం జైలర్‌లో నటిస్తున్నారు. ఇన్నేళ్ల సినీ జీవితంలో అనేక రకాల పాత్రల్లో, పలు భాషల్లో నటించి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగారు.
నేటికీ ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నారు. మధ్యలో రాజకీయ రంగ ప్రవేశ ప్రస్థానాన్ని తీసుకొచ్చారు. అయితే ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఆయనకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ వల వేస్తూనే ఉంది. ఇకపోతే సంచలన నటి కుష్భు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ మొదట తెలుగులో కలియుగ పాండవులు చిత్రంతో కథానాయికగా పరిచయమైన తరువాత కోలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యారు.
ఇక్కడ తొలి చిత్రంతోనే రజనీకాంత్ సరసన నటించే లక్కీఛాన్స్ అందుకున్నారు. ఆ తరువాత కమలహాసన్, కార్తీక్, ప్రభు వంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించి పాపులర్ అయ్యారు. అలా అభిమానులు గుడి కట్టించే స్థాయికి ఎదిగారు. అంతేకాదు ఉత్తరాదికి చెందిన కుష్భు తమిళనాడు మెట్టినిల్లుగా మార్చుకున్నారు. ఓ పక్క నటిస్తూనే మరో పక్క నిర్మాతగా మారి చిత్రాలను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. అనూహ్యంగా శనివారం స్థానిక పోయెస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. దీంతో బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా, రజనీకాంత్‌తో ఆ పార్టీ నాయకురాలు కుష్భు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
అయితే దీని గురించి నటి కుష్భు వివరణ ఇస్తూ తాను తమిళంలో నటించిన తొలి చిత్రం ధర్మత్తిన్ తలైవన్ అని అందులో రజనీకాంత్ సరసన నటించినట్లు గుర్తు చేశారు. ఆ చిత్రం విడుదలై 34 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌ను కలిశానని కాస్తంత నవ్వు, కప్పు కాఫీ వంటి సంతోషకరమైన విషయాలు మినహా ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అన్నట్టు గత ఏడాది విడుదలైన అన్నాల్తై చిత్రంలో తలైవాతో కుష్భు కలిసి నటించారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment