'ఆదిపురుష్'కి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అలానే రోజురోజుకీ వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. సినిమా స్టోరీ దగ్గర నుంచి పాత్రల గెటప్స్ వరకు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కాదన్నట్లు 'ఆదిపురుష్' లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం.. భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. దీంతో 'ఆదిపురుష్' టీమ్.. నేపాల్ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ రిలీజ్ చేసింది.
ఏం జరిగింది?
'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించారు. రిజల్ట్, వసూళ్ల గురించి పక్కనబెడితే ఇందులో సీత.. భారతదేశంలో పుట్టింది అనే అర‍్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. రిలీజ్ రోజే దీనిపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ‍్యక్తం చేసింది. దాన్ని తొలిగిస్తేనే ప్రదర్శిస్తామని పట‍్టుబట్టింది. అలానే రామాయణాన్ని వక్రీకరించేలా సినిమా తీశారని.. అక్కడ ప్రభుత్వ నేతలు భారతీయ సినిమాలపై నిషేధం విధించారు.
(ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?)
సారీ చెప‍్పిన నిర్మాతలు
నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ముదరకముందే 'ఆదిపురుష్' టీమ్ రాజీకి వచ్చింది. క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ ని రిలీజ్ చేసింది. భారతీయ సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఖాట్మండు మేయర్ ని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
లేఖలో ఏముంది?
'నేపాల్ ప్రజల మనోభావాలు ఏ విధంగానైనా దెబ్బతీసుంటే మమ్మల్ని క్షమించాలి. మేం కావాలని ఎవరి సామరస్యాన్ని దెబ్బతీయాలనుకోలేదు. ఈ మూవీని క్రియేటివ్ కోణంలోనే చూడాలని కోరుకుంటున్నాం. చరిత్రపై ఆసక్తిని పెంచి, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులని అలరించాలనే మా ఉద్దేశానికి మద్దతు ఇవ్వాలని మేం అభ్యర్థిస్తున్నాం' అని టీ-సిరీస్ లేఖలో ఉంది.
పడిపోయిన కలెక్షన్స్
ఈ లేఖపై నేపాల్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఎన్ని విమర్శలు వస్తున్నాసరే బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కలెక్షన్స్ ప్రభంజనం ఆగట్లేదు. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలి మూడురోజులు బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ, నాలుగో రోజు దారుణంగా తగ్గిపోయాయి. ఈ వారం కూడా 'ఆదిపురుష్' నిలబడితేనే లాభాల్లోకి వెళ్తుంది. లేదంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు తప్పవు!?
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని!)
Comments
Please login to add a commentAdd a comment