టైటిల్: ఏజెంట్
నటీనటులు: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మురళీ శర్మ, మమ్ముట్టి, సంపత్ రాజ్, డినో మోరియా, విక్రమ్ జీత్ తదితరులు
నిర్మాణసంస్థలు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
సంగీతం: హిప్‌హాప్ తమిజా ఆది
సినిమాటోగ్రఫీ: రసూల్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023
అసలు కథేంటంటే:
అక్కినేని అఖిల్(రామకృష్ణ) అలియాస్ రిక్కీ.. రా ఏజెంట్ కావాలనేది అతని కల. ఆ కలను నిజం చేసుకునేందుకు మూడుసార్లు పరీక్ష రాసి పాసైనా ఇంటర్వ్యూలో మాత్రం రిజెక్ట్ అవుతూ ఉంటాడు. మమ్ముట్టి(మహదేవ్) రా(RAW) ఛీఫ్. ఇండియాను టార్గెట్ చేసిన డినో మోరియా(ది గాడ్)ను అంతం చేయాలన్నదే మహదేవ్ ఆశయం. అందుకోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తాడు. అఖిల్ తన కల నేరవేర్చుకునేందుకు మహదేవ్‌ను కలుస్తాడు. కానీ అఖిల్‌ను చేర్చుకునేందుకు మమ్ముట్టి నిరాకరిస్తాడు. అదే క్రమంలో హీరోయిన్ సాక్షి వైద్య(విద్య)తో అఖిల్‌కు పరిచయం ఏర్పడుతుంది. పైలట్‌గా పనిచేస్తున్న సాక్షి వేధింపులకు గురవుతుంది. ఈ క్రమంలో అమెరికా వెళ్లాలనుకుంటున్న ఆమెకు అఖిల్ అండగా నిలుస్తాడు. అదే సమయంలో మహదేవ్ నుంచి అఖిల్‌కు ఓ ఆఫర్ వస్తుంది. కానీ ఊహించని పరిణామాలతో అఖిల్.. వైద్యను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. అసలు ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? ఇంతకు మమ్ముట్టి(మహాదేవ్).. అఖిల్‌కు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగింది? రా ఏజెంట్ కావాలనుకున్న అఖిల్ కల నేరవేరిందా? మమ్ముట్టి తన ఆశయం కోసం ఏం చేశాడు? అతని మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే అసలు కథ.
కథ ఎలా సాగిందంటే..
స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ గుర్తొచ్చేంది యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్. ఊహించని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు ఆడియన్స్‌కి కొత్త కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్స్ మాదిరే ఇందులో కూడా గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించారు. అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి. కానీ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తీర్చిదిద్దడంలో సురేందర్ రెడ్డి విఫలమైనట్లు తెలుస్తోంది. స్పై మూవీ అనగానే అందరూ ఊహించినట్లుగానే టెర్రరిస్టులను అడ్డుకునే రా ఇంటలిజెన్స్ ఆధారంగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ బట్టి కథేంటో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. అఖిల్‌ను ఈ సినిమాలో కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. అది బాగానే వర్కవుట్ అయింది. కథ బాగానే ఉన్నా.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్‌లో మమ్ముట్టి - అఖిల్ మధ్య సన్నివేశాలు, హీరోయిన్‌తో అఖిల్‌కు పరిచయం.. ఆ తర్వాత ఆమెను వదిలేయడం.. కొన్ని ట్విస్టులతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
సెకండాఫ్ వచ్చేసరికి అఖిల్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో అఖిల్ యాక్షన్, బాడీ కాస్తా హైలెట్ అని చెప్పొచ్చు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అభిమానుల స్థాయిని అందుకోలేదనే చెప్పాలి. విలన్ (ది గాడ్)ను అంతం చేసేందుకు మహదేవ్ రూపొందించిన మిషన్ సమాచారం అతనికి ముందే తెలియడం కాస్త లాజిక్ లెస్‌గానే అనిపిస్తుంది. అతని కోసం ఎవరిని పంపినా ముందే తెలిసిపోవడం.. అదే క్రమంలో అఖిల్- విలన్ డైరెక్ట్‌గా తలపడే యాక్షన్స్ సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్. మధ్యలో కొన్ని సన్నివేశాలు సంబంధం లేకుండా బోరు కొట్టిస్తాయి కూడా! స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు. ఫుల్ స్పై యాక్షన్ మూవీకి ప్రధాన బలం బీజీఎం. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్. సాంగ్స్ పర్వాలేదనిపించినా.. కొన్ని చోట్ల యాక్షన్స్ సీన్స్ ఓవర్‌గా అనిపిస్తాయి. కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని పెంచింది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ పర్వాలేదనిపించినా.. లాజిక్ లెస్ సీన్స్ వల్ల ఆడియన్స్‌కు అక్కడక్కడా బోరు కొట్టడం ఖాయం.
ఎవరెలా చేశారంటే...
స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు తగినట్లుగానే అఖిల్ తన బాడీ, స్టైల్‌తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో అఖిల్ ఫుల్ ఎనర్జీటిక్‌గా చేశాడు. ఈ చిత్రంలో అఖిల్ డిఫెరెంట్ లుక్‌లో కనిపించాడు. గతంలో రొమాంటిక్ అఖిల్‌గా కనిపిస్తే ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోను తలపించాడు. సాక్షి వైద్య తెలుగులో తన డిఫరెంట్ యాసతో అదరగొట్టింది. పైలట్ పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ లేనప్పటికీ.. కెమిస్ట్రీ బాగానే కుదిరింది. మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రా చీఫ్‌గా తన పాత్రకు న్యాయం చేశారు. విలన్‌గా డినో మోరియా లుక్ అదిరిపోయింది. విలన్ పాత్రలో కరెక్ట్‌గా ఒదిగిపోయాడు. అఖిల్ ఫాదర్‌గా మురళీ శర్మ, పొలిటికల్ లీడర్‌గా సంపత్ రాజ్ తమ పాత్రల పరిధిమేర రాణించారు. సాంకేతికత విషయానికొస్తే రసూల్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. హిప్‌హాప్ సంగీతం అంతగా మెప్పించలేదు. నవీన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment