ఆస్కార్ రేసులో హిందీ చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ను ప్రవేశపెట్టారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్ రాణిగంజ్’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ విధంగా లేనప్పటికీ మేకింగ్ పరంగా మెప్పించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ బొగ్గు గనిలో వరదలు సంభవించినప్పుడు జస్వంత్ సింగ్ గిల్ అనే ఇంజనీర్ 65 మంది కార్మికులను ఏ విధంగా రక్షించాడు? అన్నదే ఈ చిత్రకథ. జస్వంత్ సింగ్ గిల్‌గా అక్షయ్ కుమార్ నటించారు.
ఇక 96వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం యూనిట్ దరఖాస్తు చేసిందని బాలీవుడ్ టాక్. ఇదే తరహాలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కూడా ఆస్కార్ రేసులో నిలిచి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. మరి.. ‘మిషన్ రాణిగంజ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? నామినేషన్ దక్కించుకుంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్‌ని తీసుకువచ్చినట్లే ఈసారి ఈ సినిమా తెస్తుందా? అనేది 2024 మార్చిలో తెలిసిపోతుంది. మార్చి 10న ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది. మరోవైపు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం మలయాళ చిత్రం ‘2018’ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment