
‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’లో తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ తాజాగా మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు.
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజీన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో ఇండియాలోనూ అడుగుపెట్టింది. ఈ మ్యాగజీన్ తొలి సంచిక కవర్ పేజీ అల్లు అర్జున్ ఫొటోతో ‘అల్లు అర్జున్: ది రూల్’ పేరుతో రానుండటం విశేషం. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటోషూట్‌ను నిర్వహించారు. ఆప్రోమో వీడియోను షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపారు. ‘‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు.
కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని చూశాను. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను వంద శాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కూడా చదవను’’ అంటూ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment