
దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ 2015లో తెరకెక్కించిన సూపర్ హిట్ మలయాళ చిత్రం ప్రేమమ్. ఈ ఒక్క చిత్రంతో నటుడు నివీన్ బాలి, సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్‌లకు మంచి సినీ జీవితం ఇచ్చాడు ఆల్ఫోన్స్. అంతకుముందు ఇతడు తమిళంలో నేరం అనే సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని చేశారు. ప్రేమమ్ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది పృథ్వీరాజ్, నయనతార జంటగా గోల్డ్ అనే చిత్రాన్ని రూపొందించారు.
అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. దీనికి గిఫ్ట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చితత్రానికి ఆయన కథ, కథనం మాటలు ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడం విశేషం. రోమియో పిక్చర్స్ పతాకంపై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నృత్య దర్శకుడు శాండి, నటి కోవైసరళ, సహానా సర్వేశ్, నటి మహాలక్ష్మి, సంపత్‌రాజ్, రాహుల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వైవిధ్యభరితమైన ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న ఇందులో 7 పాటలు ఉండబోతున్నాయట. గిఫ్ట్ చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment