న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఢిల్లీలో కోవిడ్ కేర్ సెంటర్‌గా మారిన రాకబ గంజ్ గురుద్వారకు 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కుల గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా మీడియాకు వెల్లడించారు. అమితాబ్ రెండు కోట్లు విరాళంగా ఇస్తూ.. సిక్కులు గొప్పవాళ్లని, వారి సేవలకు సెల్యూట్ చేయాల్సిందేనని మెచ్చుకున్నాడని తెలిపారు. అంతేకాకుండా విదేశాల్లో నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సైతం ఈ కోవిడ్ కేర్ సెంటర్‌కు తెప్పించాడని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటున్నాడని మంజిందర్ చెప్పుకొచ్చారు.
కాగా కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధమైన ఈ గురుద్వారను సోమవారం ప్రారంభించనున్నారు. ఇందులో 300 బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అంబులెన్సులతో పాటు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉండనున్నారు. ఇక ఈ సేవలన్నీ పేషెంట్లకు ఉచితంగా అందిస్తుండటం విశేషం.
చదవండి: అభిషేక్ బచ్చన్ ట్వీట్: ఆయన కన్నా గొప్ప నటుడు ఎవరూ లేరు
Comments
Please login to add a commentAdd a comment