అమితాబ్ బచ్చన్.. పరిచయం అక్కరలేని పేరు.. భారతీయ సినీ రంగానికి మకుటం లేని మహారాజు అంటారు ఆయన అభిమానులు. 78 ఏళ్ల వయసులో కూడా కుర్ర నటలకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఎంతో ఉత్సాహంగా వరుసగా ప్రాజెక్ట్‌లు పట్టాలేక్కిస్తున్నారు. నటుల కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజం. సినిమాలు ఫెయిల్ అవ్వడం సహజం. కానీ అమితాబ్ జీవితంలో సినిమాలతో పాటు వ్యాపారం కూడా ఫెయిలయ్యింది. దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఒకానొక దశలో అమితాబ్ పేరిట 900 కోట్ల రూపాయల అప్పు పేరుకుపోయిందట. అప్పిచ్చినప్పుడు ఎంతో మర్యాదగా ఉన్న వ్యక్తులు.. ఆ తర్వాత ఎంతో దారుణంగా మాట్లాడారట. అసభ్య పదాలు వాడటమే కాక.. ఇంటికి వచ్చి మరి గొడవ చేశారట. ఆ సమయంలో తాను ఎంతో వేదనకు గురయ్యాను అన్నారు అమితాబ్. తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు గురించి ఓ లీడింగ్ పత్రికచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. ‘‘44 ఏళ్ల నా సినీ కెరీర్‌లో 1999 కాలం నిజంగా చీకటి రోజులే. ఆ సమయంలో నేను స్థాపించిన ఓ వెంచర్ దారుణంగా విఫలమయ్యింది. ఫలితంగా నా ముందు 900 కోట్ల రూపాయల అప్పు మిగిలింది. అప్పుల వాళ్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వారు నా ఇంటి దగ్గరకు వచ్చి నీచంగా మాట్లాడారు.. కొందరు ఏకంగా బెదిరించారు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు పాలుపోలేదు. ఆ సమస్య నుంచి బయటపడతాననే నమ్మకం కూడా లేదు నాకు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘అలాంటి సమయంలో ఓ సారి కూర్చుని పరిస్థితులను సమీక్షించుకున్నాను. ఏలాగైనా సరే అప్పులన్ని తీర్చాలని నిర్ణయించుకున్నాను. అలా ఒక దాని తర్వాత ఒకటి చొప్పున అప్పు తీరుస్తూ వచ్చాను. దూరదర్శన్‌కు బకాయి పడ్డ మొత్తాన్ని కూడా చెల్లించాను. వడ్డీ చెల్లింపుల కోసం ఆ చానెల్‌లో కొన్ని ప్రకటనల్లో కనిపించాను. అయితే అప్పు ఇచ్చిన వారు నాతో ప్రవర్తించిన పద్దతిని నేను ఎప్పటికి మర్చిపోను. నా ఇంటి దగ్గరకు వచ్చి.. నన్ను నిలదీశారు.. అసభ్య పదజాలంతో దూషించారు.. బెదిరించారు’’ అంటూ చెప్పకొచ్చారు బిగ్ బీ.
‘‘2000 సంవత్సరం నాకు బాగా కలసి వచ్చింది. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపించింది. అప్పుడు నేను నా ఇంటి వెనక నివాసం ఉండే యష్ చోప్రా దగ్గరకు వెళ్లి.. నాకు ఏదైనా పని చూపించండి అని అడిగాను. ఆయన ఇచ్చిన అవకాశమే మొహబ్బతేన్. ఆ సినిమా రూపంలో అదృష్టం తిరిగి నా జీవితంలోకి ప్రవేశిచింది. ఆ తర్వాత నేను ప్రారంభించిన కౌన్ బనేగా కరోడ్‌పతి బాగా క్లిక్ అయ్యింది’’ అన్నారు.
78 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ ఎంతో హుషారుగా పని చేస్తున్నారు. గతేడాది ఆయన గులాబో సితాబోతో డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించారు. ప్రసుత్తం ఆయన చెహ్రే, ఝుండ్, బ్రహ్మస్త్ర, మేడే, గుడ్‌బై చిత్రాలతో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment