‘‘నాకు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేదు. నా దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాను నా స్నేహితుడే నిర్మించడంతో సులభంగానే దర్శకుడిని అయ్యాను. ఈ ఎనిమిదేళ్లలో మూడు సినిమాలు తీశాను. ఈ అనుభవంతో చాలా నేర్చుకున్నాను. ఇకపై పక్కా ప్రణాళికతో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు అనీష్ ఆర్. కృష్ణ. నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణా వ్రిందా విహారి’. శంకర్ ప్రసాద్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు అనీష్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. ఇందులో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడు కృష్ణ పాత్ర చేశారు. శౌర్యలో ఒక రకమైన అమాయకత్వం, అల్లరి, కొంటెతనం ఉన్నాయి. అందుకే కృష్ణ పాత్రకు సరిపోయారు. కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం. బయటకు సరదాగా, చలాకీగా కనిపిస్తున్నా అంతర్లీనంగా ఆమెకో సమస్య ఉంటుంది. ఈ సమస్యే కథను ముందుకు నడిపిస్తుంటుంది. అది వెండితెరపైనే చూడాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment