ఏపాత్రలో అయినా ఒదిగిపోయే అతి కొద్దిమంది నటీమణుల్లో అంజలి ఒకరు అని చెప్పవచ్చు. ఈ పదహారణాల తెలుగుఅమ్మాయి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని మార్చి తెలుగులో నటిగా పరిచయమైనా, తమిళంలో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత తెలుగులోనూ మంచి మంచి పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
అంజలి పేరు చెపితే తమిళం, తెలుగు భాషల్లో చాలా చిత్రాలే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా తమిళంలో కట్రదు తమిళ్, అంగాడి తెరు, తెలుగులో గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు వంటి చిత్రాలు అంజలి కెరీర్‌లో గుర్తింపు పొందాయి. కెరీర్ ప్రారంభంలో పలు వివాదాల్లో చిక్కుకున్న అంజలి ఆ తర్వాత వాటికి దూరంగా రావడం విశేషమే. అయితే ఇప్పటికీ అవివాహితగానే కొనసాగుతున్న అంజలి కెరీర్ పరంగా అర్ధ సెంచరీని దిగ్విజయంగా టచ్ చేయడం మరో విశేషం.
ఇప్పటికీ సినిమాలు, వెబ్ సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా అంజలి కథానాయకిగా నటిస్తున్న 50వ చిత్రం ఈగై. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయని తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం అంజలి 16 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా కిందికి దూకినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. కాగా శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్‌చేంజర్ చిత్రంలో అంజలి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment