‘బ్రేకప్‌ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’ | Ankita Lokhande Denies Rhea Claim That She Had Said Spoke To Sushant On Phone | Sakshi
Sakshi News home page

‘బ్రేకప్‌ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’

Published Fri, Aug 28 2020 3:44 PM | Last Updated on Fri, Aug 28 2020 3:55 PM

Ankita Lokhande Denies Rhea Claim That She Had Said Spoke To Sushant On Phone - Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో అంకిత లోఖండే(ఫైల్‌ ఫొటో)

ముంబై: సుశాంత్‌తో విడిపోయిన అనంతరం తానెన్నడూ మళ్లీ అతడితో మాట్లాడలేదని నటి అంకితా లోఖండే స్పష్టం చేశారు. రియా చక్రవర్తి చెబుతున్నట్లుగా బ్రేకప్‌ తర్వాత తమ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదని పేర్కొన్నారు. తన సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ సందర్బంగా ‘మణికర్ణిక’ సినిమా విడుదల సమయంలో సుశాంత్‌ తన పోస్టర్‌పై కామెంట్‌ చేస్తే అందుకు బదులిచ్చానే తప్ప ఫోన్‌లో ఎన్నడూ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. అంతేగాక తాము విడిపోయిన సమయంలో సుశాంత్‌ ఎలాంటి కుంగుబాటుకు లోనుకాలేదని, మానసికంగా ఎల్లప్పుడూ దృఢంగా ఉండేవాడని స్పష్టం చేశారు. అదే విధంగా ముంబైలోని ఫ్లాట్‌ గురించి తానిప్పటికే క్లారిటీ ఇచ్చానని, ఇందుకు సంబంధించిన ఈఎమ్‌ఐలు కూడా కడుతున్నానని తెలిపారు.(చదవండి: సుశాంత్‌ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి

కాగా జూన్‌ 14న బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అనేక కీలక పరిణామాల అనంతరం ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తి ఇటీవల ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ.. సుశాంత్‌, అతడి మాజీ ప్రేమికురాలు అంకితల బంధం గురించి కామెంట్‌ చేశారు. విడిపోయిన నాలుగేళ్ల తర్వాత ఇటీవలే వీరిద్దరి మధ్య మళ్లీ మాటలు మొదలయ్యాయని అంకిత పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన అంకిత.. రియా మాటలను ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటన విడుదల చేశారు.(చదవండి: ‘ఈఎమ్‌ఐలు నేనే చెల్లిస్తున్నా.. ఇదిగో సాక్ష్యాలు’) 

‘‘ ఫిబ్రవరి 23, 2016 వరకు మేం కలిసే ఉన్నాం. తను ఎన్నడూ సైకియాట్రిస్ట్‌ను కలవలేదు. ఎలాంటి డిప్రెషన్‌కు లోనుకాలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు బ్రేకప్‌ తర్వాత మేమిద్దరం టచ్‌లోనే ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదు. నిజానికి మణికర్ణిక సినిమా విడుదల సమయంలో నాకు సంబంధించిన పోస్టర్‌  ముఖేశ్‌ చాబ్రా ఇన్‌స్టాలో షేర్‌ చేయగా సుశాంత్‌ స్పందించాడు. నాకు గుడ్‌ లక్‌ చెప్పాడు. నేను అందుకు బదులిచ్చాను అంతే. సుశాంత్‌తో నేను ఫోన్‌లో మాట్లాడనన్న రియా మాటలను ఖండిస్తున్నా. ఇప్పటి వరకు ప్రతీ ఇంటర్వ్యూలోనూ సుశాంత్‌, నేను కలిసి ఉన్నపుడు తను కుంగుబాటుకు లోనుకాలేదని చెప్పాను. అంతేకాదు మేమిద్దరం కలిసి కన్న కలల గురించి మాట్లాడాను. తను ఎక్కడైనా విజయం సాధించాలని కోరుకున్నాను. (చదవండి ‘విష ప్రయోగం వల్లే సుశాంత్‌ మృతి చెందాడు’)

అవన్నీ నిజాయితీగా నేను మాట్లాడిన మాటలే. నిజం చెప్పాలంటే నాకు రియా గురించి, సుశాంత్‌తో ఆమె బంధం గురించి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక వ్యక్తి తన ప్రాణం కోల్పోయాడనే బాధ, నిజం బయటకు రావాలనే తప్ప నాకింకా దేనిగురించి పట్టదు. ఒకవేళ నన్ను కూడా ప్రశ్నిస్తే మేం కలిసి ఉన్న నాటి సమయం గురించి నిజాలే చెబుతాను. కచ్చితంగా సుశాంత్‌ కుటుంబం వైపే నిలబడతా. రియా వైపు కాదు. ఎందుకంటే తనే అంతా చేసిందని వాళ్లు నమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన చాట్స్‌, ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని ఎవరూ కాదనలేరు. అందుకే నేను వాళ్ల వైపే ఉంటా’’అని అంకిత లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్‌ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది. సుశాంత్‌తో పరిచయం నాటి నుంచి సహజీవనం, జూన్‌ 8న ఫ్లాట్‌ ఖాళీ చేసి వెళ్లడం తదితర విషయాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement