సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అంకిత లోఖండే(ఫైల్ ఫొటో)
ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నటి, సుశాంత్ ప్రేయసిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా అతడి తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ముంబైకి చేరుకుంది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండేను బుధవారం ఈ టీం ప్రశ్నించగా.. ఆమె సుశాంత్-రియా బంధం గురించి కీలక విషయాలు వెల్లడించారు.(సుశాంత్ కేసులో మరో మలుపు.. సుప్రీంకు రియా)
2019లో తన అరంగేట్ర సినిమా‘మణికర్ణిక’ విడుదల సమయంలో తనను అభినందించేందుకు సుశాంత్ తనకు మెసేజ్ చేశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడని, రియా తనను వేధిస్తోందని చెప్పాడని తెలిపారు. అందుకే తనతో బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నట్లు సుశాంత్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను బిహార్ పోలీసులకు అందించారు. సుశాంత్ బలవన్మరణం తర్వాత అతడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రెండుసార్లు పట్నాకు వెళ్లానన్న అంకిత.. సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. ఇక విచారణ అనంతరం.. ‘‘నిజమే గెలుస్తుంది’’అంటూ అంకిత తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. (‘సుశాంత్ భార్య, తల్లీ.. అప్పుడు అన్నీ నువ్వే అంకిత’)
కాగా టీవీ నటుడిగా పరిచయమైన సుశాంత్.. ఆ తర్వాత బీ-టౌన్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో తనకు జంటగా నటించిన అంకిత లోఖండేతో అతడు ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లపాటు సజావుగానే సాగిన వీరి బంధంలో కలతలు రేగడంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సుశాంత్ రియా చక్రవర్తితో డేటింగ్ చేయగా.. అంకిత బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త విక్కి జైన్‌ను ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment