ఫిబ్రవరి 3 తన తల్లి మోనా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఒక మనసును తాకే వీడియోను విడుదల చేశాడు. ‘అమ్మ పుట్టినరోజు నేడు. తను ఉంటే ఎంత హడావిడి ఉండేదో. నేను నా అభిమానులకు చెప్పేది ఒక్కటే. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. కనుక మన కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. నిజానికి అర్జున్ కపూర్ బాల్యం అంత సుఖంగా సాగలేదు. అతడు ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్ కుమారుడు. ఇద్దరు పిల్లలు పుట్టాక బోనీ కపూర్ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం బోనీ కపూర్ కుటుంబంలో సహజంగానే తుఫాన్ రేపింది.
బోనీ కపూర్ భార్య మోనా కపూర్ బోనీ కపూర్ నుంచి దూరంగా వచ్చేసింది. బోనీ కపూర్ మీద కొంచెం కూడా ఆధారపడకుండా జీవించ దలుచుకుంది. కొడుకు అర్జున్ కపూర్, కుమార్తె అన్షులా కపూర్ ఆ కారణం వల్ల తల్లితో విపరీతంగా అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. అర్జున్ కపూర్‌కు తండ్రి రెండో పెళ్లి సమయానికి 12 ఏళ్లు. 1996లో బోనీకపూర్‌కు శ్రీదేవితో పెళ్లి జరిగాక ఆ వంటరితనం వల్ల మోనా కపూర్ చాలా బాధలే పడింది. 2012లో మరణించింది. ఆమె మరణించిన 6 సంవత్సరాలకు శ్రీదేవి మరణించింది. తండ్రి ప్రేమకు దూరమైన అర్జున్ కపూర్ తల్లిని కూడా దూరం చేసుకుని ఆ బాధ తనలో ఎప్పటికీ చెరిగిపోదని చెప్పాడు. ‘అమ్మా... నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అన్నాడు ఆ వీడియోలో. (చదవండి: అవి ఉంటేనే మజా!: జాన్వీ కపూర్)
అమ్మను ఆటపట్టించే కొడుకు
నటుడు అనుపమ్ ఖేర్‌కు తల్లి దులారి అంటే ఎంతో ప్రేమ. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. నటుడుగా ఎంత పేరున్నా తల్లి ముందు కొడుకులా ఆమెతో కబుర్లలో మునిగిపోతాడు. అంతే కాదు... ఆమెతో టైమ్‌పాస్ సంభాషణలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతను విడుదల చేసిన వీడియో జనానికి నచ్చింది. అందులో అతడు తన తల్లిని ‘అమ్మా... నీకు ఇంగ్లిష్ వచ్చా’ అని అడిగితే ఆమె ‘రాదు... నాకు ఇంగ్లిష్ రాదు... నేను చిన్నప్పుడు నీలాంటి అబ్బాయిలతో ఆడుకోవడానికి వెళ్లిపోయేదాన్ని స్కూల్ ఎగ్గొట్టి. ఒకణ్ణి కొడితే వేలు విరిగిపోయింది... చూడు ఇప్పటికీ ఉంది ఆ వంకర’ అని ఆమె ఆ వీడియోలో చూపించింది.
అప్పుడు అక్కడే ఉన్న తన తమ్ముడు రాజు ఖేర్ గురించి అనుపమ్ ఖేర్ తల్లికి ఫిర్యాదు చేస్తూ ‘చూడమ్మా.. వాడు రాత్రి ఎనిమిదిన్నరకు టీ తాగుతున్నాడు’ అనంటే ఆమె ‘ఆకలిగా ఉందేమోరా.. నిజమే.. ఈ టైమ్‌లో టీ తాగితే అడ్జస్ట్ కాదు’ అంది. ‘అడ్జస్ట్ కాదమ్మా... డైజెస్ట్’ అని అనుపమ్ ఖేర్ ఆటపట్టించాడు. ‘పెద్ద చెప్పొచ్చావులేరా గాడిదా’ అందామె. కొడుకు ఎంత పెద్దవాడైనా ఆ కొడుకును తిట్టగలిగే శక్తి ఒక్క అమ్మకే కదా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment