
ప్రభాస్ అద్భుతమైన నటుడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కితాబులిచ్చారు. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలైన తర్వాత, ఆ సినిమాలో ప్రభాస్ జోకర్‌లా కనిపించాడంటూ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఓ వేడుకలో అర్షద్ స్పందించారు. ‘‘ఏ విషయంపైన అయినా ప్రతి ఒక్కరికీ ఒక అభి్రపాయం ఉంటుంది. ప్రభాస్ అద్భుతమైన నటుడు.
దీన్ని ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. నేను ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా (‘కల్కి 2898 ఏడీ’లోని ప్రభాస్ పాత్ర భైరవను ఉద్దేశించి)లోని పాత్రను ఉద్దేశించినవి మాత్రమే. వ్యక్తి గురించి కాదు... అయితే గొప్ప నటులు ఈ తరహా పాత్రలు చేస్తే వారి అభిమానులు బాధపడతారు. ప్రస్తుతం భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.
వివిధ భాషలకు చెందిన నటీనటులు ఒక సినిమాలో భాగస్వామ్యం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అంటూ అర్షద్ మాట్లాడారు. ఇక ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లు బాక్సాఫీస్ లెక్కలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment