
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్.
అయితే సోషల్ మీడియాని ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాకుండా... పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతుంటాడు. ట్విటర్ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. అలా ఇప్పటికే చాలా మందికి సాయం అందించిన బండ్లన్న.. తాజాగా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ నెటిజన్ అభ్యర్థన గమనించిన ఆయన స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని తెలిపారు. దీంతో బండ్ల గణేశ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.