
బెల్లంకొండ సాయిశ్రీనివాస్
‘రాక్షసుడు’ వంటి హిట్ మూవీ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. పండగ సీజన్లలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. ఈ సంక్రాంతికి మా ‘అల్లుడు అదుర్స్’ చిత్రం ప్రేక్షకులకు సరైన ఎంపిక అని కచ్చితంగా చెప్పవచ్చు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రకాష్ రాజ్, సోనూ సూద్, ‘వెన్నెల’ కిశోర్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా కె. నాయుడు, సమర్పణ: రమేష్ కుమార్ గంజి.