టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుపై డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా ఖండించారు. దిల్‌రాజు గురించి మాట్లాడే అర్హత శ్రీను లేదన్నారు. శనివారం ఆయన అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ‘నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. అసలు శ్రీను అనే వ్యక్తికి దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత ఉందా? శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. వాళ్లతో మాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అసలు దిల్ రాజు-శిరీష్ అనేవాళ్లు నైజాం ఏరియాలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యుసర్ అనేవాళ్లే ఉండరు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నారు. వాళ్లు కనుక పక్కకు తప్పుకుంటే సినిమాలు చేయలేం బాబోయ్ అనే ప్రొడ్యుసర్లు ఉన్నారు. వాళ్లదగ్గరకు వెళ్లి సినిమా ఆగిపోతుంది.. రిలీజ్ కష్టంగా ఉంది అంటే ఎంత డబ్బు ఇచ్చి అయినా రిలీజ్ చేస్తారు. నాకు కూడా చాలా డబ్బు ఇచ్చారు. నాలా చాలామంది ఉన్నారు.
(చదవండి : దిల్ రాజుపై ఫైరైన క్రాక్ డిస్ట్రిబ్యూటర్)
ఇప్పుడేదో క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతున్నాడు.. నేను ఆరేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని. నువ్ ఆరు చేస్తే వాళ్లు వంద సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ థియేటర్స్‌కి రప్పించారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకి కావాలి. శిరీష్-దిల్ రాజు అనే వ్యక్తులు లేకపోతే.. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేది.
తెలిసీ తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను హుషారు సినిమా చేశానంటున్నాడు. హుషారు సినిమా బెక్కం వేణుగోపాల్ అనే చిన్న నిర్మాత చేశారు. ఇప్పటికీ ఆయన డబ్బులు కోసం తిరుగుతూనే ఉన్నాడు. కనీసం జీఎస్టీ కూడా కట్టలేదట. అలాంటి వ్యక్తి నేను ఎడ్యుకేటెడ్, పవర్ ఫుల్ మేన్‌ని అని పక్కన ఓయూ జేఏసీ విద్యార్థుల్ని పెట్టుకుని మాట్లాడుతున్నాడు.ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఉన్నారు.. ఇండస్ట్రీ పుట్టకు ముందు నుంచి ఉన్నారు. అన్యాయం జరిగితే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు.. బోలెడు అసోసియేషన్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్. నీ సినిమాలో దమ్ము ఉంది. ఆడుతుంది.. నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్ కనీసం జీఎస్టీ కట్టలేదు.. నీకు నెక్స్ట్ సినిమా ఎవడు ఇస్తాడు. ఇచ్చినా ఇలాగే ఉంటుంది.
ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. మీరు అన్నీ తెలుసుకుని ఇలాంటి జీఎస్టీ కట్టని వాళ్లకోసం మాట్లాడొద్దు. మీరు వెనకేసుకుని వస్తున్న ఆ వ్యక్తితో ముందు జీఎస్టీ కట్టించి.. అప్పుడు మాట్లాడండి. నేను ప్రెస్ మీట్ ఈ విషయం మాట్లాడాలని అనుకున్నా. కానీ సందర్భం కాదని అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్‌లో మళ్లీ చెప్తున్నా.. దిల్ రాజు, శిరీష్ లేకపోతే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది కాదు. ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే నీకు ఎందుకు? తమిళ్ వస్తే నీకెందుకు? ఆయన మంచి సినిమాలు తీస్తున్నాడు. జనాలు ఆదరించే సినిమాలు చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని కిల్ రాజు అంటావా? మేం వాళ్లతో 20 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాం.. ఇలాంటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీలో ఉండాలి’ అని బెల్లంకొండ సురేష్ ఫైర్ అయ్యారు.
కాగా, ఇటీవల క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్‌రాజు తనకు థియేటర్లు ఇవ్వడంలేదని మండిపడ్డ సంగతి తెలిసిందే. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తనకు థియేటర్లు ఇవ్వకుండా ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశాడు. దిల్ రాజు నియంతలా వ్యవహరిస్తూ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని బానిసలుగా చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment