
తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న యూట్యూబ్ స్టార్ గంగవ్వ బిగ్‌బాస్ షోలోకి ఎంటర్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా తన కష్టాలు చెప్పుకుని అందరిని ఏడిపించేసింది. పల్లెటూరి అమాయకత్వం. లోకాన్ని చదివిన అనుభవం. తెలంగాణ యాసలోని కమ్మదనం. అన్నీ కలిపితే గంగవ్వ. ఆమె టాప్ యూ ట్యూబ్ స్టార్స్‌లో ఒకరు. మై విలేజ్ షో తో ఫేమస్ అయిన గంగవ్వ నేషనల్ మీడియాని కూడా ఆకర్షించింది. స్కిట్ కాన్సెప్ట్ చెబితే చాలు. స్క్రిప్ట్ అక్కర్లేదు. అంతటి టాలెంట్ గంగవ్వ సొంతం.
సుమారు 60 ఏళ్లు ఉన్న గంగవ్వను కంటెస్టెంటుగా తీసుకురావడం విశేషమే కాదు, సాహసమనే చెప్పాలి. ఆమె ముచ్చట్లు చెప్తే తెలుగు ప్రజలు చెవులు రిక్కించి మరీ వింటారు. ఆమె మాటల గారడీకి సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల దాకా అందరూ మంత్రముగ్ధులయ్యారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు నవ్వులు పంచుతోంది గంగవ్వ. మల్లేశం సినిమాలోనూ ఆమె అతిథి పాత్రలో నటించింది. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గంగవ్వ హౌస్‌లోనూ మంచి ముచ్చట్లు పెడుతుందా? ఎవరైనా తోక జాడిస్తే మాటలతో బెదిరించి గాడిలో పెడుతుందా? అనేది చూడాలి.