జోక‌ర్ ఎలిమినేటెడ్‌, కానీ ఆ కోరిక నెర‌వేర‌నుంది | Bigg Boss 4 Telugu: Kumar Sai Evicted From Bigg Boss House | Sakshi
Sakshi News home page

కుమార్ స్క్రిప్ట్ వినేందుకు ఓకే చెప్పిన నాగ్‌

Published Sun, Oct 18 2020 11:00 PM | Last Updated on Mon, Oct 19 2020 3:37 PM

Bigg Boss 4 Telugu: Kumar Sai Evicted From Bigg Boss House - Sakshi

లీకువీరులు చెప్పిందే నిజ‌మైంది. టాస్కులు బాగా ఆడే కుమార్ సాయి బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ అత‌డికి ఘ‌న‌మైన‌, ఆత్మీయ వీడ్కోలు మాత్రం ద‌క్క‌క‌పోవ‌డం బాధాక‌రం. ఇక కుమార్‌ షోకు వ‌చ్చీరాగానే వెల్ల‌డించిన మూడు కోరిక‌ల్లో ఒక కోరిక‌ను నాగార్జున నెర‌వేరుస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో తాను అనుకుంది సాధించాన‌ని అత‌డు స్టేజీపైనే గంతులేశాడు. అలాగే స్టార్ మా దేశంలోనే నెంబ‌ర్ 1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ అని నాగ్‌ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు.

అభిని ఓడించిన దివి
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో నాగార్జున అమ్మాయిల‌ను కాద‌ని తొలిసారి అబ్బాయిల‌ను మెచ్చుకున్నారు. ఈ రోజు అంద‌రికీ చీవాట్లు వ‌డ్డించ‌కుండా ఆట‌లు ఆడించారు. అందులో భాగంగా ఇంటిస‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విడ‌గొట్టారు. అఖిల్‌, సోహైల్‌, కుమార్ సాయి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దివి, హారిక ఏ టీమ్‌గా ఏర్ప‌డ‌గా మిగ‌తా వారంద‌రూ బీ టీమ్‌లో ఉన్నారు. నోయ‌ల్ సంచాకుడిగా వ్య‌వ‌హ‌రించాడు. బెలూన్లు ప‌గ‌ల‌గొట్టే డాట్స్ గేమ్‌లో దివి గెల‌వ‌గా అభిజిత్ ఓడిపోయాడు. (చ‌ద‌వండి: తండ్రి గురించి ప‌చ్చి అబ‌ద్ధం చెప్పిన నోయ‌ల్‌!)

ట‌గ్ ఆఫ్ '‌వార్ వ‌న్ సైడ్‌'
చేతుల‌తో త‌ల‌ప‌డే ఆట‌లో హారిక మోనాల్‌ను ఓడించి త‌న స‌త్తా చూపించింది. పిగ్గీ బ్యాగ్ రేసింగ్‌లో సోహైల్ హారిక‌ను ఎక్కించుకోగా, మెహ‌బూబ్ అరియానాను ఎత్తుకుని ప‌రిగెత్తాడు. ఈ ఆట‌లో మెహ‌బూబ్ రేసుగుర్రంలా ప‌రుగెత్తి విజేత‌గా నిలిచాడు. బంతిని ఎక్కువ‌సార్లు చేతితో కొట్టే ఆట‌లో అవినాష్ ఓడిపోగా కుమార్ విజ‌యం సాధించాడు. బాస్కెట్ బాల్‌లో అఖిల్ క‌న్నా ఎక్కువ బంతులు వేసి లాస్య గెలిచింది. త‌ర్వాత రెండు టీమ్‌లు ట‌గ్ ఆఫ్ వార్ ఆడ‌గా.. బీ టీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ఏ టీమ్ విన్న‌ర్‌గా నిలిచింది. అనంత‌రం నోయ‌ల్ ర్యాప్ సాంగ్ ద్వారా అఖిల్, దివి సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: కుమార్ సాయిని గెంటేశారు!)

జోక‌ర్ డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కుమార్
గొడుగు ప‌ట్టుకుని డ్యాన్స్ చేయ‌డంలో హారిక గెల‌వ‌గా అభి ఓడిపోయాడు. జోక‌ర్‌లా నోయ‌ల్ క‌న్నా కుమార్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. పాపాయి బొమ్మ‌ను ఎత్తుకుని డ్యాన్స్ చేయ‌డంలో అఖిల్ లాస్య‌ను అధిగ‌మించ‌లేక‌పోయాడు. క‌ళ్ల‌కు గంత‌లు కొట్టుకుని అవినాష్‌, అరియానా పోటాపోటీగా డ్యాన్స్ చేసి స‌మాన స్థాయిలో నిలిచారు. స్క‌ర్ట్ వేసుకుని సోహైల్‌, మోనాల్‌ బెల్లీ డ్యాన్స్ చేశారు. సింగ‌రేణి ముద్దుబిడ్డ కాలుతున్న బొగ్గు మీద చేసిన‌ట్లు ఉంద‌ని నాగ్‌ సోహైల్‌ను మెచ్చుకున్నారు. కుర్చీల‌నుప‌యోగించి డ్యాన్స్ చేయ‌డంలో దివిని వెన‌క్కునెట్టి మెహ‌బూబ్ అదుర్స్ అనిపించాడు. (చ‌ద‌వండి: పెళ్లి విష‌యం ఏడేళ్లు దాచా: లాస్య)

ఛాన్స్ ఇస్తే కుమార్‌ను సేఫ్ చేస్తా: అరియానా
త‌ర్వాత అరియానా సేఫ్ అయిన‌ట్లు తెలిపారు. నీకు ఛాన్స్ వ‌స్తే ఎవ‌రిని సేవ్ చేస్తావ‌ని అడిగితే ఆమె కుమార్ పేరును చెప్పింది. కానీ నాగ్ మాత్రం ఇద్ద‌రిని బ్యాగులు స‌ర్దుకుని క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి ర‌మ్మ‌న్నారు. దీంతో ఏం జ‌రుగుతుందో అర్థం కాక ఇంటిస‌భ్యులు ఓ క్ష‌ణం అవాక్క‌య్యారు. అఖిల్ మాత్రం మోనాల్ వెళ్లిపోతుందేమోన‌ని ఏడ్చేశాడు. కానీ ఆమె మాత్రం త‌న‌కు కూడా ఇక్క‌డ ఉండ‌టం ఇష్టం లేద‌ని, ఎవ‌రితో మాట్లాడాల‌ని లేదని క‌న్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇంటిస‌భ్యులు మాత్రం మోనాల్ వెళ్ల‌డం లేద‌ని బ‌లంగా న‌మ్ముతూనే కుమార్‌ను స‌రిగా ప‌ట్టించుకోనేలేదు. 

నాకు న‌చ్చ‌నిది వంకాయ‌, హారిక‌: కుమార్‌
ఇక క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి వెళ్లిన ఆ ఇద్ద‌రిలో కుమార్ ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్‌ ప్ర‌క‌టించారు. అయితే తాను అనుకున్న మూడింటిలో ఒక‌దాన్ని సాధించి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నాడు. నాగార్జున‌కు క‌థ చెప్పాల‌న్న కోరిక‌కు ఆయ‌న‌ అనుమ‌తించారు. త‌ర్వాత ఇంటి స‌భ్యులంద‌రినీ ఒక్కో కూర‌గాయ‌తో పోల్చాడు. అరియానాను ఉల్లిపాయ, అవినాష్‌ను ఆట‌లో అర‌టిపండును, అఖిల్‌ను క‌రివేపాకు, మాస్ట‌ర్‌ను కాక‌ర‌కాయ, అభిజిత్ కూల్ కీర‌దోస‌గా, లాస్యను మొక్క‌జొన్న‌(ముసుగులో న‌వ్వే వ్య‌క్తి)గా, నోయ‌ల్ మెల్లిమెల్లిగా త‌రెచుకునే వ్య‌క్తి క్యాబేజీగా, సోహైల్ టైమ్‌పాస్ వేరుశెన‌గ‌కాయగా అభివర్ణించాడు.(చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నొప్పితో విల‌విల్లాడిన కుమార్‌)

మాస్ట‌ర్‌పై బిగ్‌బాంబ్‌
దివి పైనాపిల్(లోప‌ల బాగానే ఉన్నా పైన‌కు కోపంగా క‌నిపించే వ్య‌క్తి)‌గా, హారికను త‌న‌కు న‌చ్చ‌ని వంకాయగా, మెహ‌బూబ్‌ను ఉడ‌క‌బెట్టిన గుడ్డుతో పోల్చాడు. ఉన్న‌దున్న‌ట్టుగా చెప్పిన కుమార్ మాట‌ల‌ను కొంద‌రు కంటెస్టెంట్లు తీసుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌ర్వాత అంద‌రి కోరిక మేర‌కు కుమార్ డ్యాన్స్ చేశాడు. అదే స‌మ‌యంలో మోనాల్ క‌న్ఫెష‌న్ రూమ్‌లో నుంచి బ‌య‌టకు రావ‌డంతో అందరిక‌న్నా ఎక్కువ అఖిల్ తెగ సంతోషించాడు. వారం రోజుల‌పాటు వాష్‌రూమ్స్ శుభ్రం చేయాల‌న్న బిగ్‌బాంబ్‌ను కుమార్ మాస్ట‌ర్‌పై వేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement