
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఆరో వారంలో అడుగు పెట్టినా ఇప్పటికీ ఎవరు టాప్ 5లో ఉంటారనేది చెప్పడం కష్టంగానే ఉంది. కానీ గడిచిన ఐదు వారాల్లో కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అందరూ ముందే ఊహించగలిగారు, ఒక్క దేవి నాగవల్లి ఎలిమినేషన్ తప్ప! ఐదో వారం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సుజాత నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఆమె నామినేషన్‌లోకి రాకపోవడంతో ఇన్ని వారాలు ఇంట్లోనే ఉండగలిగింది. అలా అని ఆమె టాస్కులు బాగా ఆడలేదని కూడా కాదు, కాకపోతే ఆమె నవ్వు చాలామందికి చిరాకు తెప్పించింది. అది ఫేక్ నవ్వు అని ప్రేక్షకులు బలంగా నమ్మారు. ఇక స్టార్ హీరో నాగార్జునను పట్టుకుని గౌరవం లేకుండా బిట్టూ అని పిలవడం ఆయన అభిమానులు సహించలేకపోయారు. (చదవండి: బిగ్‌బాస్‌ను వీడిన గంగవ్వ, అఖిల్ కంటతడి)
అయితే ఈ బిట్టూ పిలుపు వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సుజాత మాట్లాడుతూ.. "నేను అక్కడికి వెళ్లగానే బిగ్‌బాస్ టీమ్.. నాగార్జున అంటే ఇష్టమా అని అడిగారు. ఇష్టం, అందులోనూ ఆయన చేసిన 'మనం' సినిమా, బిట్టు పాత్ర మరీ మరీ ఇష్టమని చెప్పాను. దీంతో బిట్టు అని పిలవడానికి నీకు ఇష్టమేనా అని అడిగారు, సరేనన్నాను. నేను అలా పిలిచినప్పుడు కూడా నాగార్జున సర్ చాలా సంతోషపడ్డారు. ఒకవేళ అలా పిలవడం నాగార్జునకు గానీ, బిగ్‌బాస్ టీమ్‌కు కానీ నచ్చకపోతే వెంటనే కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి వద్దని చెప్పేవాళ్లు. కానీ వాళ్లంతట వాళ్లే బిట్టు అని పిలవమన్నారు. అయితే ఇది ఆయన అభిమానులకు బాధ కలిగిస్తే క్షమించండి. నేను కావాలని మాత్రం పిలవలేదు" అని క్లారిటీ ఇచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: హౌస్‌లో సుజాతకు ఆఖరి రోజు!)
Comments
Please login to add a commentAdd a comment