శివాజీ.. చాలా మందికి పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్, కాంట్రవర్సీ మధ్యలో ఉండే టాప్ 5గురు వ్యక్తుల్లో శివాజీ ఒకరు. తనకు అవసరం లేని విషయాల్లో తల దూర్చి.. తన ప్రయాణమెటో తెలియకుండా.. చివరికి విశ్వసనీయత కోల్పోయి.. అందరికీ దూరమయిన శివాజీ.. ఇప్పుడు చివరి అవకాశంగా బిగ్ బాస్ ను ఎంచుకోవడం ఒక వ్యక్తి ఉత్తాన పతనాలకు అతి పెద్ద ఉదాహరణ.
బ్యాక్ గ్రౌండ్
1997లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన శివాజీది అప్పటి గుంటూరు జిల్లా నరసరావుపేట. జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా చేరిన శివాజీ ఓ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే స్థాయికి చేరాడు. అతడు నటించిన తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ. కానీ ఫస్ట్ రిలీజైంది మాత్రం మాస్టర్. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు.. సినిమాల్లో హీరోగా నటించాడు.
వేగంగా అవకాశాలు దూరం
తన స్థాయికి మించిన హీరో పాత్రల్లో ఒదిగిపోలేక, కమెడియన్ పాత్రలు చేయలేక.. మొత్తానికి వెండితెరకు దూరమయ్యాడు. పూలమ్మిన చోటే కట్టెలన్నట్టు.. నితిన్‌కు జయం, దిల్, సంబరం సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 2018లో వచ్చిన గ్యాంగ్‌స్టర్స్ అనే వెబ్ సిరీస్‌లో చివరిసారిగా కనిపించాడు.
వివాదాలు - విమర్శలు
బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారిన శివాజీ.. తనకు అచ్చి రానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. చేతులు పూర్తిగా కాలితే కానీ.. అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్లి తనకు మాలిన పనులు చేసి చరిత్రలో మిగిలిపోయాడు శివాజీ. చంద్రబాబు కోసం తన విశ్వసనీయతను తాకట్టు పెట్టుకుని నవ్వులపాలయి క్రెడిబిలిటీ కోల్పోయాడు.
గరుడ పురాణం
ఓ కట్టుకథను అత్యంత అందంగా, సినిమా రైటర్లతో స్క్రీన్‌ప్లే రాయించి గరుడపురాణం పేరుతో ఓ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేసి మీడియాలో ఓ అరగంట స్పేస్ కొట్టేసే ప్లాన్ దిగ్విజయంగా అమలు చేశాడు. శివాజీ మాయమాటలు నమ్మిన ఎల్లో మీడియా, టిడిపి నేతలు.. కొన్నాళ్ల పాటు గరుడ పురాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మొత్తంగా నవ్వులపాలయ్యాయి.
రాజకీయ జోస్యం
ఓ సారి అమరావతి వెళ్ళిన శివాజీ వైఎస్సార్‌సిపికి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ పొగపెట్టే ప్రయత్నం చేశాడు. వైఎస్సార్‌సిపి ఓటుకు రూ.50వేలు ఇచ్చినా.. 2019లో టిడిపి గెలుస్తుందంటూ బాకా ఊదే ప్రయత్నం చేశాడు. ఇంత చేసినా ఎన్నికల్లో శివాజీ బలపరిచిన టిడిపి మట్టి కొట్టుకుపోయింది. అనంతర కాలంలో బీజేపీలో చేరి టిడిపి అనుకూల రాజకీయం చేసేందుకు ప్రయత్నించినా.. ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు బీజేపీ కూడా ఆయన సేవలు వాడుకుంటున్నట్టు లేదు.
నోరుతెరిస్తే అమరావతి, పోలవరం
రాష్ట్రం అభివృద్ధి కావాలన్నది అందరి ఆకాంక్షే. దాంట్లో తప్పు లేదు కానీ.. లేని క్రెడిట్ మొత్తం చంద్రబాబుకు చెందాలన్న గరుడ పురాణం శివాజీ తాపత్రయం ఎన్నికల ముందు బెడిసికొట్టింది. పోలవరంను చంద్రబాబు పూర్తి చేశారని, అమరావతిలో ఆకాశహర్మ్యాలను నిర్మించేస్తున్నారని శివాజీ చేసిన తెగ హడావిడి ఇప్పటికీ యూట్యూబ్ లింకుల్లో బాగానే నిక్షిప్తమయి ఉంది.
రాజకీయంగా వైసీపీకి నష్టం చేయాలన్న దుర్భుద్ధితో నానా పాట్లు పడ్డ శివాజీని గానీ, ఆయన పురాణాలను గానీ ప్రజలు నమ్మే దుస్థితిలో లేరు. రాని రాజకీయాలను నమ్ముకుని సినిమాలకు వచ్చాడు, కలిసి రాని గరుడ పురాణాలతో ప్రజలకు దూరమయ్యాడు. ఇప్పుడు బుద్ధి మారిందా..? లేక అదే తీరుతో బిగ్ బాస్ నుంచి బయటకు పంపిస్తారా? త్వరలోనే తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment