
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) ప్రతి సీజన్‌లో ఓ కమెడియన్ కచ్చితంగా ఉండాల్సిందే! ఎప్పుడూ గొడవలతో అగ్నిలా భగభగమండుతూ ఉండే హౌస్‌లో నవ్వుల వర్షం కురిస్తేనే బాగుంటుంది. అందుకే కమెడియన్ ఉంటేనే షోకి కళ. ఈ సారి ఓ ఫేమస్ కమెడియన్‌ను పట్టుకొచ్చారు. అతడే జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel). నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ, ఎదుటివారి పెదాలపై నవ్వు చూడటం కోసం తనపై తాను జోకులు వేసుకోవడానికి కూడా వెనుకాడడు.
ఒక్క ఛాన్స్
తాజాగా బిగ్‌బాస్ 9 స్టేజీపై అడుగు పెట్టిన ఇమ్మాన్యుయేల్ తన జర్నీ వివరించాడు. 'నేను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదు. అందుకే అమ్మానాన్నకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్నాను. పొలంపనిలో సాయం చేశాను. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఛాన్స్ ఇస్తాడంటారు. అలా నాకు వచ్చిన ఒక్క ఛాన్స్.. నేను కన్న కలవైపు మొదటి అడుగు పడేలా చేసింది. అవకాశం వచ్చింది, కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు.
నాగార్జునతో కామెడీ
మూడేళ్లు గడిచిపోయాక మన తలరాత మనమే రాసుకోవాలని అర్థమైంది. వందల స్కిట్లు రాసి, అందులో నటించి మిమ్మల్ని అలరించాను. బిగ్‌బాస్‌లో నా పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను' అంటూ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే తన టాలెంట్‌నంతా బయటపెట్టాడు. నాగార్జునతో.. బిగ్‌బాస్‌లో మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని అంటూ జోకులు మొదలుపెట్టేశాడు. అలాగే ఆడ గొంతుకతో పాట పాడి అలరించాడు. తర్వాత మిమిక్రీ చేశాడు.