బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో ఉంది. అందుకే పలు భాషలతో పాటు తెలుగులోనూ ఇది విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. అయితే బిగ్‌బాస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఈ షోను విమర్శించేవాళ్లు కూడా లేకపోలేరు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ వల్ల అవకాశాలు, ఆదరణ దక్కిందని కొందరు, ఇమేజ్ డ్యామేజ్ అవడం తప్ప పైసా కూడా ఉపయోగం లేదని మరికొందరు ఇలా రకరకాలుగా మాట్లాడారు.
నిజానికి హౌస్‌లో జరిగినదాంట్లో ఒక గంట ఎపిసోడ్ మాత్రమే ప్రసారం చేస్తారు. అసలు 24 గంటలు ఏం జరిగిందనేది కేవలం కంటెస్టెంట్లకు మాత్రమే తెలుస్తుంది. ఏ గొడవల్ని హైలైట్ చేయాలి? ఎవరిని నెగెటివ్‌గా చూపించాలి? ఎవరి రిలేషన్‌ను ఫోకస్ చేయాలి? అనేది బిగ్‌బాస్ టీమ్ చేతిలో ఉంటుంది. దీంతో ప్రేక్షకులు గంట ఎపిసోడ్ చూసి ఎవరేంటని ఓ నిర్దారణకు వస్తారు. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో షణ్ముఖ్ జశ్వంత్‌ను బ్రహ్మగా భావించారు. అతడి మైండ్ గేమ్ చూసి గేమర్ అని పొగిడారు. అన్నీ బాగానే ఉన్నా సిరితో ఫ్రెండ్‌షిప్ మాత్రం మొదటికే మోసం తెచ్చింది. ఎందుకంటే షణ్నుకు ఆల్‌రెడీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఉంది. అటు సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది.
కానీ వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాక ఆ విషయాలను మర్చిపోయినట్లు ప్రవర్తించారు. ఓ పక్క ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నామని పశ్చాత్తాపపడుతూనే మరోపక్క హగ్గులిస్తూ, ఒకరి ఒడిలో ఒకరు నిద్రిస్తూ అతి చేశారు. హగ్గులు నచ్చడం లేదని సిరి తల్లి వచ్చి చెప్పినప్పటికీ ఇద్దరూ తీరు మార్చుకోలేదు. నన్ను వదిలేస్తున్నవా? అని శ్రీహాన్ అడిగినప్పుడు సైతం వాళ్ల ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఎప్పటిలాగే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. వీళ్ల వైఖరితో విసుగెత్తిపోయిన నెటిజన్లు ఫ్రెండ్‌షిప్ పేరుతో ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్నారేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట మీకోసం ఒకరున్నారన్న విషయం మర్చిపోయి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎంత ట్రోలింగ్ జరిగినా షణ్నుకు అండగా దీప్తి, సిరికి అండగా శ్రీహాన్ నిలబడ్డారు. వారి గెలుపుకు అడ్డు కావద్దనో ఏమో కానీ దీప్తి తన బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తనతో మనసు కకావికలం అయిపోయినప్పటికీ బయటకు మాత్రం మౌనంగానే ఉండిపోయింది. షో ముగిసాక సరైన సమయం చూసుకుని అతడికి బ్రేకప్ చెప్పింది. ఇద్దరం బాగా ఆలోచించి విడిపోదామని నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఇద్దరూ దూరమవ్వడానికి సిద్ధపడితే మరి షణ్ముఖ్ ఎందుకు బ్రేకప్ పోస్ట్ పెట్టలేదని ఆరా తీస్తున్నారు. కేవలం గంట సేపు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో చూసి విడిపోవాలనుకోవడం మూర్ఖత్వమని మండిపడుతున్నారు. ఐదేళ్ల ప్రేమను ఒక్క షో తెంచివేయగలిగిందంటే మీ బంధం ఎంత గట్టిదో అర్థమవుతుందని, అసలు మీది ఫేక్ రిలేషన్ అని విమర్శిస్తున్నారు. సిరి-శ్రీహాన్ బాగానే ఉనప్పుడు మీ జంట మాత్రం ఎందుకు విడిపోతున్నారో అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment