వీడియో చూపించిన బిగ్‌బాస్‌: సిగ్గుతో తలదించుకుని సారీ చెప్పిన సిరి | Bigg Boss Telugu 5: Anee Master, Lobo, Priyanka Singh Safe In 2nd Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: అబద్ధమాడిన సిరి, షణ్ముఖ్‌.. నాగ్‌ వార్నింగ్‌

Published Sat, Sep 18 2021 11:14 PM | Last Updated on Sun, Sep 19 2021 11:58 AM

Bigg Boss Telugu 5: Anee Master, Lobo, Priyanka Singh Safe In 2nd Week - Sakshi

Bigg Boss Telugu 5, Episode 14: వీకెండ్‌ వచ్చిందంటే చాలు అత్యంత సుందరంగా ముస్తాబవుతారు హౌస్‌మేట్స్‌. వాళ్ల అందాలను చూసి మెచ్చుకునే నాగ్‌ హౌస్‌లో చేసిన తప్పొప్పులను ఎత్తి చూపుతూ చీవాట్లు కూడా పెడతాడు. దీంతో అప్పటిదాకా ఒకరి మీద ఒకరు నిప్పులు చెరిగిన కంటెస్టెంట్లు నాగ్‌ రాగానే గప్‌చూప్‌ అయిపోతుంటారు. ఇదిలా వుంటే నేటి (సెప్టెంబర్‌ 18) ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌, మాస్ట్రో టీమ్‌.. నితిన్‌, నభా నటేష్‌, తమన్నా ముఖ్య అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఆ విశేషాలేంటో చదివేయండి..

సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నాడు: రామ్‌ చరణ్‌
బిగ్‌బాస్‌ హమీదాతో ట్రయాంగిల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు కనిపించగా లహరి మాత్రం తాను అందరినీ అన్నయ్య అని పిలవడానికి రెడీ అంటోంది. ఇంతలో సన్నీని జైలు నుంచి విడుదల చేశారు. ఇక లోబో, ఉమాదేవి రొమాన్స్‌ చేసుకోవడం చూసిన రవి, సిరి పడీపడీ నవ్వారు. ఆ తర్వాత హాట్‌స్టార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన రామ్‌చరణ్‌ స్టేజీ మీదకు వచ్చాడు. ఇంత అందంగా, ఎంతో ఫిట్‌గా ఉన్న నాగ్‌ను అన్న అనే పిలుస్తానన్నాడు. సాయిధరమ్‌ తేజ్‌ గురించి చెప్తూ అతడు కోలుకుంటున్నాడని, అతడి ఆరోగ్యం గురించి భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశాడు.

మా అక్క సంగీత్‌కు కొరియోగ్రాఫర్‌ యానీ మాస్టరే..
రామ్‌చరణ్‌ను చూసి సర్‌ప్రైజ్‌ అయిన ఇంటిసభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా చెర్రీ.. యానీ మాస్టర్‌ను చూసి.. తన అక్క సంగీత్‌కు ఈవిడే కొరియోగ్రఫీ చేసిందని మెచ్చుకున్నాడు. ఇవాళ తాను లోబోలాగా డ్రెస్‌ వేసుకుని వచ్చాననడంతో లోబో గాల్లో తేలిపోయాడు. తర్వాత నాగ్‌.. ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ.. ఉమాదేవి.. మంచి మనిషే కానీ అప్పుడప్పుడూ బూతులు మాట్లాడుతుందన్నాడు. శ్వేత.. పైకి సాఫ్ట్‌గా మాట్లాడుతున్నా మీద పడి కొట్టేసేంత వైల్డ్‌ అని పేర్కొన్నాడు.

బయటకొచ్చాక కలుద్దామంటూ పింకీకి ఆఫర్‌
నటరాజ్‌ మాస్టర్‌ తన జీవితంలో జరిగిన మర్చిపోలేని అనుభూతి గురించి చెప్తూ.. ఒక దగ్గర డిన్నర్‌ జరుగుతుంటే రామ్‌చరణ్‌ తనకు ప్లేట్‌లో ఫుడ్‌ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడని భావోద్వేగానికి లోనయ్యాడు. తర్వాత చెర్రీ మాట్లాడుతూ.. యాంకర్‌ రవి కాస్త ఏడిపించడం తగ్గించాలని సూచించాడు. ప్రియాంక.. చెర్రీకి తానో పెద్ద అభిమానిని అని, మీతో ఫొటో దిగాలనుందని మనసులో మాట బయటపెట్టింది. దీంతో చెర్రీ.. బయటకొచ్చాక తప్పకుండా కలుద్దామన్నాడు. అయితే ఈ యంగ్‌ హీరోను రెండు రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంచేసుకుంటామని ప్రియ తన కోరిక వెలిబుచ్చింది, కానీ దీనికి రాజమౌళి ఒప్పుకోడని కౌంటరిచ్చాడు నాగ్‌. ఇక షణ్ముఖ్‌ చెర్రీకి గాల్లో ముద్దులు పంపాడు. తనకోసం ఓ పాట పాడమని చెర్రీ అడగడంతో శ్రీరామ్‌ అందుకు వెంటనే ఓ పాటందుకున్నాడు. కాజల్‌ను అందరూ పనిమనిషిని చేశారని నాగ్‌ చెప్పగా పని చేసే తను పనిమంతురాలు అని ప్రశంసించాడు చెర్రీ.

ఇక్కడ కూడా అవసరమా? నితిన్‌ పరువు తీసిన చెర్రీ
తర్వాత నాగ్‌ స్థానంలో హోస్టింగ్‌ చేసిన చరణ్‌.. మాస్ట్రో టీమ్‌ను స్టేజీ మీదకు పిలిచాడు. ఇంకా తన పాత్ర నుంచి బయటకు రాని నితిన్‌ అంధుడిగానే నటిస్తూ వచ్చాడు. ఇది చూసిన చెర్రీ.. ఇక్కడ కూడా అవసరమా? అదీ నాముందు! అనడంతో వెంటనే నితిన్‌ నార్మల్‌ అయిపోయాడు. ఈ సందర్భంగా నభా నటేష్‌, తమన్నా, చెర్రీ, చరణ్‌ అంతా కలిసి స్టెప్పులేస్తూ స్టేజీని ఓ ఊపు ఊపేసి వీడ్కోలు తీసుకున్నారు.

అప్పుడు రోజుకు 60 సిగరెట్లు, ఇప్పుడు 7 మాత్రమే
ఇక ఇంటిసభ్యులను సెట్‌ చేయడానికి సిద్ధమైన నాగ్‌ టాస్కుల్లో ప్రాణం పెట్టారు కానీ బిహేవియర్‌ మాత్రం బాలేదని పెదవి విరిచాడు. ఎవరెవరు తమ బిహేవియర్‌ బాలేదు అనుకుంటున్నారో లేచి నిలబడమనగానే ఉమాదేవి, సిరి, లోబో, శ్వేత, యానీ, శ్రీరామ్‌, సన్నీ లేచి నిలబడ్డారు. మొదట ఉమా.. నామినేషన్‌ సమయంలో అసభ్యకరంగా మాట్లాడాను అని తన తప్పు ఒప్పుకుంది. దీనిపై నాగ్‌ క్లాస్‌ పీకడంతో ఉమ గుంజీలు తీస్తూ క్షమాపణలు కోరింది. యానీ మాస్టర్‌ నిలబడగా.. అరవడం తప్పేం కాదన్నాడు నాగ్‌. తర్వాత లోబో వంతు రాగా.. గతంలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడివి అని నాగ్‌ గుర్తు చేయడంతో ఇప్పుడు ఏడు మాత్రమే తాగుతున్నానని చెప్పాడు. షో అయిపోయేలోపు సిగరెట్‌ మానేస్తానని ప్రామిస్‌ చేశాడు.

తప్పైందంటూ చెంపలు వాయించుకున్న శ్వేత
నామినేషన్‌లో అందరికీ మానవత్వం లేదన్నావు, మరి హమీదా ముఖం మీద పెయింట్‌తో ఎందుకు కొట్టావు?  అని నాగ్‌  ప్రశ్నించడంతో శ్వేత అవమాన భారంతో చచ్చిపోయింది. అది కచ్చితంగా తప్పే అని అంగీకరించిన శ్వేత అందరి ముందే రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టుకుంది. తర్వాత సన్నీ.. తనను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎందుకు ఎంచుకున్నారో చెప్పమని నాగ్‌ను ఆవేదనతో అర్థించాడు. దీంతో నాగ్‌.. సిరి వైపు చూస్తూ.. సన్నీ నీ షర్ట్‌ లోపల చేయి పెట్టి బెటాన్‌ తీశాడా? అని ప్రశ్నించాడు. అందుకామె అవునని చెప్పింది. మరింత క్లారిటీ కోసం షణ్ముఖ్‌ను అడగ్గా అతడు కూడా సన్నీ చేయి పెట్టాడు అని పేర్కొన్నాడు. దీంతో నాగ్‌ వాళ్లకో క్లారిటీ ఇవ్వడానికి టాస్క్‌లోని వీడియో ప్లే చేసి చూపించగా సన్నీ.. సిరి షర్ట్‌ లోపల చేయి పెట్టలేదని రుజువైంది. దీంతో సిరి అతడికి సారీ చెప్పి హగ్గిచ్చింది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరి క్యారెక్టర్‌ను తప్పు పట్టకూడదని నాగ్‌ హెచ్చరించాడు. ఆ తర్వాత యానీ మాస్టర్‌, లోబో, ప్రియాంక సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement