
Bigg Boss Telugu 5, Episode 77: 'నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా' టాస్క్‌లో సన్నీని గెలిపించడం కోసం కాజల్ కెప్టెన్ మానస్‌తో కయ్యానికి దిగింది. అతడు ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ తిరకాసులు పెట్టింది. సన్నీ గెలవాలంటే సిరి, యానీ ఇద్దరి ఫొటో కాల్చేయాల్సిందేనని మొండిపట్టు పట్టింది. హౌస్ అంతా కళ్లలో నిప్పులు పోసుకుంటున్నా తను మాత్రం సన్నీ కోసం ఒంటరిగా ఫైట్ చేసింది. మానస్ ఎంత ఒప్పించినా ఆమె వెనక్కి తగ్గలేదు. వీరిద్దరూ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో యానీ, సిరి ఇద్దరి ఫొటోలు కాలిపోయాయి. ఎన్ని రౌండ్లయినా ఒక్కసారైనా ఫొటో కాలని సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో అతడు సంతోషంతో స్టెప్పులేశాడు.
పాస్ గెలుచుకున్న సన్నీ.. బోరుమని ఏడ్చిన యానీ
అయితే సిరి, యానీ మాత్రం.. డ్రామాలాడుతున్నారంటూ కాజల్‌ను ఏకిపారేశారు. యానీ అయితే వెక్కెక్కి ఏడుస్తూ వాళ్లతో మాట్లాడేది లేదని శపథం చేసింది. తొండి గేమ్‌లు, నాటకాలంటూ ఆవేశంలో నానా మాటలు అనేసింది. వీరిని కూల్ చేయాల్సింది పోయిన రవి అందుకు భిన్నంగా అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడాడు. ఇప్పుడు ఆడోళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడింది సన్నీ కాదా? అంటూ హౌస్‌మేట్స్‌ను మరింత రెచ్చగొట్టాడు. యానీ రోదన చూడలేకపోయిన శ్రీరామ్ ఒక అడుగు ముందుకేసి.. ఆమెను అంతలా ఏడిపిస్తూ, తన ఉసురు పోసుకోవడం అవసరమా? అని ప్రశ్నించాడు. దీంతో బిత్తరపోయిన కాజల్ ఉసురు పోసుకోవడం వంటి పెద్దపెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదని, ఇది గేమ్ అని కుండ బద్ధలు కొట్టింది.
ఆ నలుగురికి గోల్డ్ ఇచ్చిన రవి
తర్వాత నాగార్జున... ఈ వారం బెస్ట్ పర్ఫామర్‌కు బంగారం, వరస్ట్ పర్ఫామర్‌కు బొగ్గు ఇవ్వాలని ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాజీ కెప్టెన్ రవి.. ప్రియాంక సింగ్, మానస్, యానీ, శ్రీరామ్‌లకు బంగారం ఇచ్చాడు. సన్నీ, కాజల్, సిరి, షణ్నుతో పాటు తనకు తాను బొగ్గిచ్చుకున్నాడు. ఈ సందర్భంగా నాగ్.. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావ్ కదూ! అని రవి మీద అనుమానం వ్యక్తం చేయగా అతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో శ్రీరామ్ దగ్గరున్న నెగెటివ్ పవర్‌ను తీసుకుని బంగారం కోల్పోయి బకరా అయ్యావని కామెంట్ చేశాడు.
తప్పా? రైటా? తెలియట్లేదు, లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు
బాత్రూం లోపల, బయట తల కొట్టుకుంటూ నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావని నాగ్ సిరిని ప్రశ్నించాడు. ఆమను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించుకుని మాట్లాడాడు. కోట్లమంది నిన్ను చూసి ఈ అమ్మాయిలా ఉండాలనుకోవాలి కానీ ఈవిడలా మాత్రం ఉండకూడదు అని భావించకూడదని సుద్దులు చెప్పాడు. తన సమస్యేంటో చెప్పమన్నాడు. దీంతో ఓపెన్ అయిన సిరి.. 'నేను ఎమోషనల్ పర్సన్. నేను ఎదుటివాళ్లను హర్ట్ చేసే వ్యక్తిని కాను. ఎవరేం అన్నా నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడిచేకొద్దీ షణ్నుతో నా కనెక్షన్ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది. ఇది తప్పా? రైటా? తెలియట్లేదు. లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు. కానీ నేను నటించడం లేదు. నాకు ఈ ఫీలింగ్ తప్పని తెలిసినా సరే చేయాలనిపిస్తే చేసేస్తున్నా' అని చెప్తూ బాధపడింది సిరి. ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇవ్వగా మరోసారి రిపీట్ చేయనని మాటిచ్చింది సిరి.
గేమ్ కన్నా నా మీదే ఆసక్తి చూపిస్తోంది: మానస్
కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన షణ్ను.. మెంటల్లీ వీక్ అయిపోయాను. సిరి అలా తనను తాను గాయపర్చుకోవడానికి కారణం నేనే, అంటే తప్పు నాదే అని అంగీకరించాడు. ప్రేయసి దీప్తి సునయనను మిస్ అవుతున్నావా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. అంతలా దీప్తిని మిస్ అవుతుంటే, ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్లిపోమని గేట్లు తెరిచాడు నాగ్. పదేపదే ఇలా ట్రిప్ అవ్వకూడదని సూచించాడు. తర్వాత మానస్ కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చాడు. ప్రియాంక హౌస్‌లో ఎవరినీ నమ్మదని, ఎవరితోనూ ఎక్కువ క్లోజ్‌గా ఉండదన్నాడు. నన్ను మాత్రమే ఎక్కువగా నమ్ముతూ కొన్నిసార్లు గేమ్ కన్నా నామీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని, అది తనకు ఇబ్బందిగా మారిందన్నాడు.
యానీ, నీ ప్రవర్తన హద్దులు మీరుతోంది: నాగ్
మానస్ మాటలు విన్నాక నాగ్.. ప్రియాంక అతడి కోసం ఏడ్చేసిన వీడియో చూపించాడు. ఆమె ఫీలింగ్స్ ఎక్కడివరకు వెళ్తున్నాయో చూసుకోమన్నాడు. తను నొచ్చుకుంటుందని ఏమీ చెప్పకపోతే పరిస్థితులు చేదాటిపోతాయని హెచ్చరించాడు. కాజల్‌తో ప్రవర్తించిన తీరు బాగోలేదని యానీకి చురకలు అంటించాడు నాగ్. వెక్కిరించడం కొంతవరకే బాగుంటుందని, కానీ అది హద్దులు మీరుతోందని హెచ్చరించాడు. అయితే యానీ మాత్రం తనది చైల్డిష్ బిహేవియర్ అని, ఏదున్నా ముఖం మీదే చెప్తానంటూ ఏవేవో చెప్తూ చివరాఖరకు వెక్కిరించడం మానుకుంటానని హామీ ఇచ్చింది. అనంతరం శ్రీరామచంద్ర, సన్నీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్.
Comments
Please login to add a commentAdd a comment