
గంగూబాయ్ కతియావాడి సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు, టైటిల్ రోల్ పోషిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మీద కేసు నమోదైంది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. ఈ నేపథ్యంలో కథపై అభ్యంతరం తెలుపుతూ గంగూబాయ్ కతియావాడి కుమారుడు బాబూజీ రాజీ షా కోర్టుకెక్కారు. అలియా, సంజయ్‌లతో పాటు 'ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీ, సినిమాకు సహకరించిన రిపోర్టర్ జేన్ బోర్గ్స్ పైన బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం తమ ఆత్మ గౌరవాన్ని, స్వేచ్ఛను దెబ్బ తీయడంతో పాటు పరువుకు భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రచురణలను నిలిపివేయడంతో పాటు దీని ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను సైతం ఆపేయాలని కోరారు. (చదవండి: ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి)
ఈ విషయంపై బాబూజీ రాజీ షా తరపు న్యాయవాది నరేంద్ర దూబే మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రోమో రిలీజైనప్పటి నుంచి షా, అతడి కుటుంబం గురించి వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అతడు ఉంటున్న ప్రదేశంలో సైతం వేధింపులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై దాడి జరగ్గా కాలు ఫ్రాక్చర్ అయింది. మరోవైపు వేశ్య కుటుంబం అంటూ షా, అతడి బంధువులను ఎగతాళి చేస్తున్నారు' అని పేర్కొన్నారు. సినిమాలో మహిళను అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. కాగా దీనిపై స్పందించాల్సిందిగా కోరుతూ.. కోర్టు చిత్రయూనిట్‌కు జనవరి ఏడు వరకు గడువునిచ్చింది. (చదవండి: వైరల్: కలిసి నటిస్తున్న మహేశ్, రణ్‌వీర్!)
Comments
Please login to add a commentAdd a comment