టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబంలో కొద్దిరోజులుగా జరుగుతున్న గొడవలు తార స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆ కుటుంబ సభ్యులు తాజాగా మరో కేసులో చిక్కుకున్నారు. చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్(Manchu Manoj) శ్రీవిద్యానికేతన్‌లోకి (Sree Vidyanikethan) వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.
ఈమేరకు మనోజ్, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.
రెండురోజుల క్రితం మనోజ్.. తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలసి తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి ఎంబీయూ యూనివర్శిటీ సమీపంలోని మోహన్‌బాబు డెయిరీ ఫాం గేటు వద్దకు చేరుకున్నారు. మనోజ్‌కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషించుకున్నారు. దీంతో ‘రేయ్ ఎవర్రా మీరంతా.. వాళ్లను పట్టుకోండి’ అంటూ మనోజ్ తన అనుచరులను పూరమాయించాడు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్‌పై దాడి చేశారు.
(ఇదీ చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్)
గొడవల వల్ల అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదే సమయంలో మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment