‘‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా బాధగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. ‘దేవర’ సినిమా గురించి చె΄్పాలని, ఈ సినిమా కోసం మేం పడ్డ కష్టాన్ని వివరించాలని చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. కానీ భద్రతా పరమైన కారణాల వల్ల ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది... ఎక్కువ కూడా’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఇది.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటించారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ నిర్వహించాలనుకున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రతా కారణాల వల్ల రద్దు అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మీరు నాపై కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను.
ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ‘దేవర’ సినిమా నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను బ్లేమ్ చేయడం తప్పని నా భావన. కానీ ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబరు 27న మనందరం కలవబోతున్నాం. ‘దేవర’ చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. నేను మీకు ఎప్పుడూ చెప్పినట్లే... మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత. దాంతో వచ్చే ఆనందాన్ని నా మాటల్లో చెప్పలేను. ఈ సెప్టెంబరు 27న అదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి. అందరూ ఆనందించండి.
మీ ఆశీర్వాదం ఈ ‘దేవర’కు చాలా అవసరం. నాకూ చాలా అవసరం. దయచేసి మీ అశీర్వాదాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకొక్కమాట.. మీరందరూ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్లాలని ఇంకొక్కసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...‘దేవర’ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్‌లో ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని’ అనే డైలాగ్ ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment