మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'చూడాలని ఉంది' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1998వ సంవత్సరం.. ఆగష్టు 27న విడుదలైన ఈ చిత్రం నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది. అప్పట్లో ఒకే రకం ఫక్తు హీరోయిజం ఉన్న పాత్రల్లో కనిపిస్తున్న చిరంజీవి.. హిట్లర్ నుంచి రూట్ మార్చారు. తన హీరోయిజం పక్కనబెట్టి కాసింత కొత్తదనం ఉన్న కథలను ఎంచుకునే క్రమంలోనే 'చూడాలని ఉంది' సినిమా విడుదల అయింది.
అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఇందులో సౌందర్యతో పాటు అంజల ఝవేరి, ప్రకాశ్‌రాజ్ అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అంతలా కథను గుణశేఖర్ రాసుకున్నాడు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
సినిమా ప్రకటనతో ఫ్యాన్స్‌లో ఆందోళన
మెగాస్టార్‌కు స్టార్ ఇమేజ్‌తో పాటు అప్పటికే ఆయన వరుసగా 6 హిట్లు కొట్టి దూసుకుపోతున్నాడు… అందులోనూ టాలీవుడ్‌లో మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉన్న హీరో... దీంతో ఆయన తర్వాత తీయబోయే సినిమా ఏంటి అని అంతటా చర్చా... ఆ సమయంలో 'చూడాలని ఉంది' అనే క్లాస్ టైటిల్‌తో సినిమా చెయ్యడం ఏంటి..? అది కూడా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ డైరెక్టర్ అయిన గుణశేఖర్‌కు ఛాన్స్ ఇవ్వడం ఏంటని అప్పట్లో చిరు డై హార్డ్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు.
అంతేకాకుండా సినిమాపై కూడా వారు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఎందుకంటే..? ఈ సినిమాకు ముందు రామ్ గోపాల్ వర్మ, సింగీతం శ్రీనివాసరావులతో చిరంజీవి-అశ్వనిదత్‌లు చేయాల్సిన రెండు సినిమాలు స్టార్ట్ అయ్యి అర్థాంతరంగా ఆగిపోయాయి. కానీ మెగాస్టార్ డేట్స్ చేతిలో ఉండి కూడా సినిమా తీయలేకపోతున్నాను అనే బాధ అశ్వనిదత్‌లో ఉంది. అలాంటి సమయంలో ఒక కథను గుణశేఖర్ ఆయన వద్దకు పట్టుకొచ్చాడు. దీంతో కథ కూడా ఆయనకు నచ్చడం ఆపై వెంటనే చిరంజీవి వద్దకు గుణశేఖర్‌ను పంపించడం వంటివి జరిగిపోయాయి. చిరంజీవిని గుణ కలవడం అదే తొలిసారి కూడా..
కానీ 'చూడాలని ఉంది' అనే టైటిల్‌ను మాత్రం మెగాస్టారే సెలెక్ట్ చేశారని అప్పట్లో గుణ చెప్పాడు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్‌లో భారీ అపార్ట్ మెంట్ సెట్‌తో పాటు కొన్ని ఇంటీరియర్స్‌ని ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి నేతృత్వంలో వేశారు. ఇందుకు గాను అప్పట్లో రూ.75 లక్షలు ఖర్చు చేశారు. ఒక సినిమా సెట్ కోసం ఇంత ఖర్చు చేయడం ఏంటని ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యపోయారు.
ఒక్క సీన్ కోసం రైల్వేస్టేషన్.. సినిమాకు అదే హైలెట్
రైల్వేస్టేషన్‌లో చిరంజీవి- అంజల ఝవేరి మధ్య లవ్ సీన్ దాదాపు పది నిమిషాలు ఉంటుంది. చిరంజీవికి అసలు డైలాగ్‌లు ఉండవు. ఆయన స్టేషన్‌లో చైర్ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. చిరంజీవికి డైలాగ్ లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడపటం మామూలు విషయం కాదు. అలాంటిది 10 నిమిషాల పాటు ఆ సీన్ రన్ అవుతుంది. ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని గుణశేఖర్ పట్టుబట్టి మరీ నిర్మాత అశ్వనిదత్‌ను ఒప్పించాడు. అతి కష్టమ్మీద రైల్వే నుంచి అనుమతి లభించడం... ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్‌లోనే ఆగిపోయారు.
'చూడాలని ఉంది' సినిమాలో ఇవన్నీ ప్రత్యేకం
► పద్మావతి.. పద్మావతి అనే డైలాగ్‌తో పాటు 'రామ్మా చిలకమ్మా' అనే పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవికి ఇష్టంలేకపోయినా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని కాదని, ఈ పాట ఉదిత్ నారాయణతో పాడించారు మణిశర్మ.
► చూడాలని ఉంది సినిమాకు రెండు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది.
► డైలాగ్ లేకుండా చిరంజీవి- అంజల ఝవేరి మధ్య పది నిమిషాల పాటు లవ్ సీన్.. ఇది వర్కౌట్ అవుతుందా అని షాకైన అశ్వనీదత్.. తర్వాత సినిమాకు ఇదే హైలెట్‌గా నిలిచింది.
► మాస్టర్ సజ్జా తేజ ( ప్రస్తుతం యంగ్ హీరో) ఈ సినిమాతోనే ఎంట్రీ.. మూవీలో అతన్ని స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరేసే సీన్ చేయడానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకోలేదట. చిన్న పిల్లాడిని అలా విసరడం బాగోదని అనడంతో ఎలాగోలా ఒప్పించి చేయడంతో ఆ సీన్ బాగా క్లిక్ అయింది.
► కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ సినిమా 63సెంటర్స్‌లో వందరోజులకు పైగానే కొనసాగింది. అప్పట్లో ఈమూవీ 20కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలుకొట్టింది
► బాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన దివంగత సరోజా ఖాన్ కోసం ముంబయి వెళ్లగా చిరు సాంగ్‌కి కంపోజ్ అనగానే బిజీగా ఉన్నాసరే ఆమె ఒకే చేసింది. 'ఓ మారియా సాంగ్'కు గాను ఆమెకు నంది అవార్డు వరించింది.
► ఈ సినిమాలో 'రామ్మా చిలకమ్మా' అనే పాట ఉదిత్ నారాయణ్‌కు తెలుగులో మొదటి పాట. ఆ పాట చాలా హిట్ అయ్యింది.
► అల్లు అరవింద్- అశ్వినిదత్ కలిసి 'చూడాలని ఉంది' చిత్రాన్ని 'కోల్‌కతా మెయిల్' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అందులో హీరోగా అనిల కపూర్ నటించారు. ఈ సినిమాతో చేరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని అశ్వినిదత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment