Chiranjeevi Condolence To Gudipudi Srihari: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (88) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుడిపూడి శ్రీహరి మరణం పట్ల పలువురు సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
'గుడిపూడి శ్రీహరి గారు ఓ నిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీ విమర్శకుడు. నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు.. నటుడిగా నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోవడానికి ఎంతో ఉపకరించాయి. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను' అని చిరు ట్విట్ చేశారు. అలాగే మరోవైపు ఇటీవల ఓ కార్యక్రమంలో గుడిపూడి శ్రీహరి గురించి చిరంజీవి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ శ్రీహరికి నివాళి అర్పిస్తున్నారు.
గుడిపూడి శ్రీహరి గారు ఓనిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీవిమర్శకుడు.నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు,నటుడిగా నన్నునేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోడానికి ఎంతో ఉపకరించాయి.ఆయన మరణం సినీ పాత్రికేయరంగానికి తీరనిలోటు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను pic.twitter.com/wCTFIrQby3
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 5, 2022
ఈ వీడియోలో ''నా నట జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన వారిలో గుడిపూడి శ్రీహరి, పీఎస్‌ఆర్ ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్ తదితర జర్నలిస్ట్‌లు ఉన్నారు. నా సినిమా సెట్లో వారితో చర్చించి ఎన్నో విషయాలు నేర్చుకునేవాడిని. ఆరోగ్యకరం జర్నలిజం అంటే ఏంటో వారి దగ్గర తెలుసుకున్నా. ఒకప్పుడు గుడిపూడి శ్రీహరి 'సితార'లో సినిమా రివ్యూలు రాశేవారు. ఆయన పదజాలం కొంచెం హార్ష్‌గా అనిపించినా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి చెబుతున్నట్లు ఉండేది. నేను బాగా నటిస్తున్నాని, పోరాటాలు, డ్యాన్సులు అన్నింటిల్లో వేగం పెంచానని ప్రశంసిస్తూనే డైలాగ్‌లు చాలా వేగంగా చెబుతున్నానని విమర్శించారు. 'నటనలో స్పీడ్ ఉండాలి గానీ మాటల్లో కాదు. మనం చెప్పే మాట ముందు మన చెవికి వినపడాలి. తర్వాత ఇతరులకు వినపడాలి' అని చెప్పి నాలో మార్పు తీసుకొచ్చారు'' అని చిరంజీవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment