
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందే ఉంటారు . అలా ఎందరినో ఆదుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడికి ఆస్పత్రి చికిత్స అందించడమే గాక ఆదివారం రోజు ఆయనను పరామర్శించారు.
ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సను అందించే ఏర్పాటు చేశారు. జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషించారు. ‘ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉంది’అని ఈ సందర్భంగా చిరంజీవి ప్రశంసించారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఓ వైపు ‘ఆచార్య’ షూటింగ్, మరోవైపు నిహారిక వివాహమహోత్సవం సందర్భంగా బిజీలో ఉన్నప్పటికి ఇలా పరామర్శకు వచ్చి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్.