సాక్షి, హన్మకొండ చౌరస్తా: ‘ఓరుగల్లు ప్రజల ప్రేమ, వాత్సాల్యం స్వచ్ఛమైనది. ఈ గడ్డపై ఎన్నో సంవత్సరాల తర్వాత అడుగుపెట్టా. అప్పుడు ప్రజా అంకిత యాత్రకు వచ్చిన జనవాహిని, అభిమానం నేడు మళ్లీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది’ అని మెగాస్టార్ చిరంజీవి ఆనాటి రాజకీయ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ విజయ విహార విజయోత్సవ సభ శనివారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగింది. వేలాదిగా తరలివచ్చిని అభిమానుల నడుమ విజయోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ప్రత్యేక అతిథిగా మెగా పవర్‌స్టార్ రాంచరణ్ హాజరు కాగా సినీ దర్శకుడు బాబీ, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్‌తో పాటు చిత్ర బృందం, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నగర మేయర్ గుండు సుధారాణి, చిత్ర బృందం సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర బృందానికి మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్‌లు షీల్డ్‌లు అందజేసి సత్కరించారు. అనంతరం రాంచరణ్‌కు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య షీల్డ్‌ను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అశేష అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా విజయోత్సవ సభను ఎక్కడా జరుపుకుందామని తాము చర్చించుకుంటున్న సమయంలో స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనమని అందుకే ఇక్కడ సభ నిర్వహించేందుకు సిద్ధపడినట్లు తెలిపారు. ఒక బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. గ్యాంగ్‌లీడర్, ఘరానామొగుడు లాంటి సినిమాల్లో మాదిరిగా మళ్లీ నన్ను అభిమానులకు అలా చూపించిన దర్శకుడు బాబీ, మంచి హిట్‌ను అందించిన నిర్మాతలు నవీన్, రవిశంకర్, ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.
మేము క్వైట్‌గా ఉన్నంత వరకే..
మెగా పవర్‌స్టార్, చిరంజీవి తనయుడు రాంచరణ్ మాట్లాడుతూ ‘ఇటీవల కాలిఫోరి్నయాకు వెళ్తే.. ఓ మ్యాగజైన్ ఎడిటర్ మీ దగ్గర అభిమానం ఎలా చూపెడుతారు అని అడిగారు.. ఇప్పుడు చెబుతున్న అభిమానమంటే ఇలా ఉంటుంది’ అని చూపెట్టారు. తనకు హిట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ నాన్నకు హిట్ ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సినిమా అంటే ప్యాషన్, ప్రేమ ఉన్నవారే ఇలాంటి చిత్రాలు ఇవ్వగలరన్నారు. సినిమాలో పూనకాలు సాంగ్ నన్ను రవితేజ దమాకా సినిమా చూసేలా చేసిందని పేర్కొన్నారు. చిరు సినిమాలకు ఎవరు ముఖ్య అతిథులు ఉండరని, ఆయనే అతిథి అని అన్నారు. ‘మా నాన్న చిరంజీవి చాలా సౌమ్యుడు. అందుకే నిశ్శబ్దంగా ఉంటున్నాడు. అతను క్వైట్‌గా ఉన్నంత వరకే ఏం చేసినా. లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయి’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది.
బ్లాక్‌లో కొని చూశా: దర్శకుడు బాబీ
తాను ఇంటర్ చదువుతున్న సమయంలో హాస్టల్ గోడ దూకి రూ.200 వెచ్చించి బ్లాక్‌లో క్యాసెట్ కొని అన్నయ్య సినిమా చూశానని సినిమా దర్శకుడు బాబీ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కావడానికి సహకరించిన దర్శకులు వీవీ వినాయక్, మెహర్‌రమేష్‌లకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాను ప్రేమ, మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితో చేశానని అన్నారు.
వరంగల్‌లో స్టూడియో పెట్టండి: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌లో సినీ స్టూడియో పెట్టండి.. అందుకోసం స్టేజీపైన ఉన్న ఎమ్మెల్యేలు, నేను సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతో మాట్లాడాతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నిర్మాత నవీన్‌తో తనకు 20 సంవత్సరాలకు పైగా సన్నిహితం ఉందని, మంచి మిత్రుడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment