
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. నేడు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా జానీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనపై వచ్చిన ఆరోపణలతో ఈ పోస్ట్ ఊస్ట్ కావడం ఖాయమని తెలుస్తుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్) జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్ పోలీస్టేషన్‌లో కేసు కూడా నమోదు అయింది. దీంతో ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్‌గా తీసుకుంది. ఒకరు చేసిన తప్పువల్ల అసోసియేషన్ మొత్తానికి చెడ్డ వస్తుందని భావించిన యూనియన్ జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
జానీ పదవితో పాటు అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూనియన్ బైలాస్ ప్రకారం అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్‌ను తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు. సోమవారమే ఈ నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో నేడు (మంగళవారం) నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
అసోసియేషన్ నిబంధనల ప్రకారం జానీ మాస్టర్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది. యూనియన్ సభ్యులు కూడా ఇదే కోరుతున్నారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని పలువురి నుంచి డిమాండ్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment