
హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించారు. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలిరోజే భారీ రెస్పాన్స్ రావడంతో ఎక్కడ చూసిన వీకెండ్‌లో హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి.
కోర్టు సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 24.40 కోట్లు రాబట్టింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.11 కోట్లతో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే, మొదటిరోజు రూ. 8.10 కోట్లు, రెండో రోజు రూ. 7.80 కోట్లు, మూడోరోజు రూ. 8.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. కోర్టు సినిమా ఫస్ట్‌డే నాడు ప్రీమియర్స్ షోలతో కలిపి వచ్చిన కలెక్షన్స్ కంటే మూడోరోజు ఎక్కువ రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మధ్య కాలం వచ్చిన సినిమాల్లో కోర్టు చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.

ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రెండు కోట్లు ఈ చిత్రానికి వచ్చాయని అంచనా వేస్తున్నారు. కోర్టు సినిమా హీరో నానికి భారీ లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ లాంగ్ రన్‌లో రూ. 50 కోట్ల క్లబ్‌లో ఈ చిత్రం చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment