
ఈ వారం విడుదలైన చిన్న చిత్రాలను మిచాంగ్ తుపాన్ దెబ్బకొట్టింది. తుపాన్ ప్రభావంతో చాలా చోట్ల ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టడానికే జనాలు భయపడుతున్నారు. దీంతో జనాలు లేక థియేటర్లు బోసిపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తమిళనాట లియో చిత్రం తరువాత జపాన్, జిగర్‌తాండ డబుల్ ఎక్స్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జిగర్‌తాండ డబుల్ ఎక్స్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఒకేరోజు నాలుగు సినిమాలు'
ఆ తరువాత పెద్ద చిత్రాలేవీ విడుదల కాకపోవడంతో నయనతార నటించిన 'అన్నపూరణి', హరీష్ కల్యాణ్ నటించిన 'పార్కింగ్', రియోరాజ్ నటించిన 'జో', దర్శన్ కథానాయకుడిగా నటించిన 'నాడు' వంటి నాలుగైదు చిత్రాలు ఇదే మంచి ఛాన్స్ అనుకుంటూ డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో లేడీ సూపర్ స్టార్ నటించిన అన్నపూరణి చిత్రం మినహా అన్నీ చిన్న చిత్రాలే.
దెబ్బకొట్టిన తుపాన్
అయినప్పటికీ ఇవన్నీ మంచి కంటెంట్‌తో రూపొందిన చిత్రాలుగా ప్రశంసలు పొందడంతో పాటు ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. దీంతో ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తుపాన్ వారి ఆనందానికి గండి కొట్టింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఏది గొయ్యో, ఏదో నుయ్యో తెలియనంతగా ఊరు వాడా అంతా జలమయమైంది. థియేటర్లకు వెళ్లడం సంగతి దేవుడెరుగు.. ఇళ్లలోకి నీరు చేరకుండా కాపాడుకోవడమే కష్టంగా మారింది. అలా తుపాన్ గండం ఈ వారం విడుదలైన చిత్రాల వసూళ్లకు గండి కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment