‘‘సార్’ సినిమా అన్నివర్గాల వారికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ల కథతో కనెక్ట్ అవుతారు. ‘సార్’ మీ అందరి కథ.. మీకు నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారంవిడుదలకానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘2002లో నా తొలి చిత్రం విడుదలయినప్పుడు నెర్వస్‌గా ఉన్నా.. ఇప్పుడు 2023లో నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశాను.. ప్రతి సినిమాని నా మొదట దిగానే భావిస్తా. ‘సార్’ ఒక సింపుల్ ఫిల్మ్.. కానీ, గ్రాండ్ ఎమోషన్స్, మెసేజ్ ఉంటుంది. నా తర్వాతి తెలుగు సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘ఒక మనిషి జీవన శైలిని మార్చేది చదువు మాత్రమే.
అంత గొప్ప ఆయుధాన్ని డబ్బులేని వాళ్లకి దూరం చేయడం ఎంత వరకు న్యాయం? అనే ప్రశ్నే ‘సార్’ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఒకప్పటి తరంలో శివాజీ గణేశన్‌గారు, కమల్ హాసన్‌గారు, తెలుగులో ఎన్టీఆర్‌గారు, నాగేశ్వరరావుగారు.. ఇలా తొలి తరం నటుల్లో ఎంత గొప్పవారుఉన్నారో తర్వాతి తరం గొప్ప నటుల్లో ధనుష్‌కి నేను టాప్ ప్లేస్ ఇస్తాను.. ఎందుకంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు భయం లేదు. పని చేయడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అలా పనిచేసుకుంటూ పోయే ధనుష్‌ని ఎవరూ ఆపలేరు’’ అన్నారు.
‘‘మా సార్’ చిత్రం ప్రీమియర్స్ ఒక రోజు ముందే వేస్తున్నామంటే సినిమాపై మాకు ఎంత నమ్మకం ఉందో జనాలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చాలా మంచి సినిమా ఇది.. ఎవరూ నిరుత్సాహపడరు’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘నా ‘తొలి ప్రేమ’ సినిమా తర్వాత ఇంత నమ్మకంగా చెబుతున్నా. ‘సార్’ ప్రీమియర్స్ అయిన తర్వాత వచ్చే మౌత్ టాక్‌తో 17న అందరూ సినిమాకి వస్తారు’’ అన్నారు వెంకీ అట్లూరి. ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కెమెరామేన్ జె.యువరాజ్, నటుడు సాయికుమార్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment