సాక్షి, బెంగళూరు: లెజెండరీ బ్యాడ్మింటన్ ఆటగాడు, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ పడుకొనే (65)కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని క్రీడాభిమానులు కోరు కుంటున్నారు. దాదాపు10 రోజుల క్రితం దీపికా తల్లి ఉజ్జల, సోదరి అనిషా కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో వీరు హోం ఐపోలేషన్‌లో ఉన్నారు. అయితే ప్రకాష్ పడుకొనేకు జ్వరం తగ్గకపోవడంతో గత శనివారం బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారని ప్రకాష్ పడుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండో రోజుల్లో ప్రకాష్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు.
కాగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన పడుకొనే 1970, 1980 లలో తన ప్రతిభాపాటవాలతో రోల్ మోడల్‌గా అవతరించారు. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడు ప్రకాష్ పడుకొనే కావడం విశేషం.1983 ఎడిషన్‌లో కాంస్యం సాధించి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయుడుగా ఖ్యాతి గడించారు.డెన్మార్క్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్స్ , స్వీడిష్ ఓపెన్‌లో బ్యాక్-టు-బ్యాక్ టైటిల్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. 1991లో పదవీ విరమణ అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గాను, 1993 నుండి 1996 వరకు భారత జట్టుకు కోచ్ గా కూడా ప్రకాష్ పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment